ప్రజాశక్తి -సీలేరు
విశాఖ నుండి భద్రాచలం వెళ్తున్న విశాఖపట్నం డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్ సర్వీస్ గురువారం రాత్రి 11 గంటల సమయంలో మరమ్మతులకు గురై చింతపల్లి బస్టాండ్‌లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఎముకులు కొరికే చలిలో బిక్కు బిక్కు మంటూ నిరీక్షించవలసిన దుస్థితి నెలకొంది. ఈ బస్సులో ప్రయాణించిన పండా రామ్మోహన్ కథనం ప్రకారం... విశాఖ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన విశాఖపట్నం డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ నైట్ సర్వీస్ బస్ నర్సీపట్నం చింతపల్లి మీదుగా భద్రాచలం చేరాల్సి ఉంది. డౌనూరు వచ్చేసరికి పవర్ స్టీరింగ్ బాక్స్‌లో ఆయిల్ లీక్ అవుతున్నట్లు డ్రైవర్ గమనించారు. అయినా ఆపకుండా రాత్రి 11 గంటలకు చింతపల్లి చేరుకున్నారు. అక్కడ బస్సు డ్రైవర్ పవర్ స్టీరింగ్ బాక్సులో ఆయిల్ ఉందో లేదో అని పరిశీలించగా పూర్తిస్థాయిలో ఆయిల్ అయిపోయినట్లు గుర్తించారు. బస్సు ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్లే పరిస్థితి లేదని ప్రయాణికులకు బస్సు డ్రైవర్ చెప్పారు. దీంతో గురువారం రాత్రి చింతపల్లి బస్టాండ్‌లో ఎముకులు కొరికే చలిలో సుమారు 50 మంది ప్రయాణికులు గంటకు పైగా నిరీక్షించవలసిన దుస్థితి నెలకొంది. బస్ డ్రైవర్ విశాఖ ఆర్టీసీ మేనేజర్‌కు సమాచారం అందించారు. దీంతో నర్సీపట్నం డిపోకు చెందిన టూ స్టాప్ బస్సు చింతపల్లిలో నైట్ హాల్ట్ ఉండగా, దానిలో ప్రయాణికులను భద్రాచలం తరలించారు.
ఇటీవల రాత్రి సమయాల్లో కారడవిలో విశాఖ, మధురవాడ డిపోలకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్ సర్వీసులు మరమ్మతులు గురై నిలిచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాలం చెల్లిన అల్ట్రా డీలక్స్ బస్సుల్ని ఆర్టీసీ అధికారులు నడుపుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. సుదీర్ఘ ప్రాంతాలకు అందులోనూ ఘాట్ రోడ్డులో ప్రయాణించే బస్సులు కండిషన్‌లో లేకపోవడంపైనా, ఇలాంటి సంఘటనలు పలు మార్లు చోటుచేసుకోవడంపైనా, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపైనా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు కండిషన్ కలిగిన బస్సుల్ని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.










