ప్రజాశక్తి -సీలేరు
ఆర్టీసీ నైట్ సర్వీసు బస్సు చింతపల్లి సమీపంలోని కారడవిలో మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మరమ్మతులు గురై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చలితో అనేక ఇబ్బందులు పడ్డారు. మధురవాడ డిపోకు చెందిన 3408 నెంబర్ గల ఆర్టీసీ ఆల్ట్రా డీలక్స్ నైట్ సర్వీస్ బస్సు మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలంలో బయలుదేరి రాత్రి 9.30 గంటలకు సీలేరు చేరింది. ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సీలేరులో భోజనాలు అనంతరం బయలుదేరి వెళ్తుండగా, చింతపల్లికి దగ్గరికి వెళ్లేసరికి బస్సు కింద భాగం నుంచి పెద్ద శబ్ధాలు రావడంతో పాటు టైర్ల నుంచి పొగలు బస్సులో కమ్మేయడంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు మేలుకొని ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వెంటనే డ్రైవర్‌కు విషయం చెప్పారు. అయినా డ్రైవర్ పట్టించుకోలేదు. చింతపల్లి కాంప్లెక్స్‌లో కూడా బస్సుకు ఏమైందో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చింతపల్లి నుంచి రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత బస్సు ఒక పక్కకు ఒరిగినట్లు అనిపించడంతో డ్రైవర్ అప్పుడు బస్సు ఆపి కిందికి దిగి పరిశీలించగా బస్సు మరమ్మతులకు గురైనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నత అధికారులకు డ్రైవర్ తెలియజేయడంతో అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో చింతపల్లి కాంప్లెక్స్‌లో నైట్ హార్ట్ ఉన్న నర్సీపట్నం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను నర్సీపట్నం తరలించారు. కారడవిలో బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో గంటన్నర పాటు గజగజ వణుకుతూ ఇబ్బందులు పడ్డారు. నర్సీపట్నం వెళ్ళిన తర్వాత విశాఖపట్నం వెళ్లడానికి అధికారులు బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చలిలో వణుకుతూ సుమారు గంటసేపు నర్సీపట్నం కాంప్లెక్స్‌లో ప్రయాణికులు నిరీక్షించారు. విశాఖపట్నం డిపోకు చెందిన మరో అల్ట్రా డీలక్స్ బస్సు భద్రాచలం నుంచి నర్సీపట్నం కాంప్లెక్సు బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు వచ్చింది. ఆ బస్సులో ఈ ప్రయాణికులను ఎక్కించారు. ఘాట్ రోడ్డులో కాలం చెల్లిన బస్సులు నడుపుతూ ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘాట్ రోడ్డులో కండిషన్ ఉన్న బస్సులను నడపాలని కోరుతున్నారు.










