వీరఘట్టం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో గ్రామాల్లో సచివాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 2020 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ నిధులతో సుమారు రూ.40 లక్షలు అంచనా వ్యయంతో భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా మండల కేంద్రానికి నాలుగు సచివాలయాలు మంజూరయ్యాయి. వీటిలో ఒకటి ప్రభుత్వం భవనంలో ఉండగా, మిగిలిన మూడింటి భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. రెండు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద, మరొకటి పాత పంచాయతీ కార్యాలయం పక్కన నిర్మాణ దిశలో ఉన్నాయి. వీటితో ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా నేటికీ ఇంకా శ్లాబ్ దశల్లోనే ఉన్నాయి. ఇటీవల గుత్తేదారుకు బిల్లులు మంజూరు చేసినా, పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. భవన నిర్మాణాలు చేపట్టకపోవడంతో చుట్టూ మొక్కలు మొలుస్తూ పాడుబడిన భవనాల్లా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సచివాలయ భవననిర్మాణాలను తక్షణమే పూర్తి చేసి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.










