ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు రెండ్రోజులుగా చేస్తున్న దీక్షలు శుక్రవారం ముగిశాయి. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రెండో రోజు దీక్షలను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరుకుమార్ ప్రారంభించి దీక్షా పరులకు పూలమాలలేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టర్స్ కార్మికులందర్నీ రెగ్యులర్ చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీనిచ్చి నాలుగేళ్లు దాటినా నెరవేర్చలేదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికుల పట్ల ఇంతటి నిర్లక్ష్యం సరికాదన్నారు. పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహాయ కార్యదర్శి సిలార్ మసూద్ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ధరలు పెరిగిన నేపథ్యంలో కుటుంబ పోషణకు జీతం ఏ మాత్రమూ చాలడం లేదన్నారు. కార్మికులు అర్ధాకలితో పని చేస్తున్నారని, వారి జీవితానికి, ఉద్యోగానికి భద్రత లేదని ఆవేదన వెలిబుచ్చారు. సాయంత్రం దీక్షలను రైతుసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎ.సాల్మన్, నాయకులు టి.మల్లయ్య, డి.యోహన్, నవీన్, విజయలక్ష్మి, కృపారావు, ఇజ్రాయిల్, పి.జాన్, షేక్ ఖాదర్, సామ్రాజ్యం, మర్తమ్మ , లుదియమ్మ, కవిత, జె.పాపారావు, నరసింహారావు, రవికుమార్ పాల్గొన్నారు. దీక్షలకు జై భీమ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.జాన్‌పాల్, పిడిఎం జిల్లా అధ్యక్షులు మస్తాన్‌వలి, ఎన్.రామారావు అంగన్వాడీ వర్కర్స్ యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లేశ్వరి, సిఐటియు జిల్లా అధ్యక్షులు హనుమంతురెడ్డి సంఘీభావం తెలిపారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : మున్సిపల్ కార్మికుల దీక్షలను సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుధ్య కార్మికులను ఆప్కాస్ అనే సంస్థలో చేర్చడం వల్ల మున్సిపల్ కార్మికులు సంక్షేమ పథకాలేమీ వర్తించడం లేదని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సబ్బులు, నూనెలు, యూనిఫామ్, చెప్పులు ఇవ్వాలన్నారు. పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, బదిలీ కార్మికులను వెంటనే రెగ్యులర్ కార్మికుల్లో కలిపి సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. క్లాప్ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18,500 ఇవ్వడంతోపాటు వివిధ రకాల సెలవులనూ వర్తింపజేయాలన్నారు. ఈ సమస్యలపై 27న మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, వచ్చేనెల 7న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, వీటికి కార్మికులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. దీక్షలో కార్మికులు సీతారామయ్య, ఎం.ప్రతాప్, శ్యాంకోటి, డి,చిన్న వెంకటేశ్వర్లు, కె.కొండలు, ఎ.ఆంజనేయులు, పి.సురేంద్ర, కె.సురేష్, ఎం.రాజేష్, యు.రామారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - దాచేపల్లి : స్థానిక లైబ్రెరీ సెంటర్‌లో నగర పంచాయతీ పారిశుధ్యకార్మికులు దీఓలు చేపట్టగా పలువురు మాట్లాడుతూ కాంట్రాక్ట్ పేరుతో తమ శ్రమను ఏళ్ల తరబడి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తమను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేశారని ఆవేదనకు గురయ్యారు. తమ డిమాండ్లను అంగీకరించకుంటే సమ్మెకు పూనుకుంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు ఆంజనేయరాజు, వెంకటేష్, శివరామకృష్ణ, శాంసన్, సైదులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచర్ల: మున్సిపల్ కార్మికులు దీక్ష చేశారు. తమకు సిఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నాయకులు కె.రమణ, అనసూయ, కార్మికులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి:మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండవ రోజు రిలే దీక్షలను పూలదండలు వేసి ప్రారంభించారు. ముగింపు కార్యక్రమంలో నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింప చేశారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు రొంపిచర్ల పురుషోత్తం, మామిడి జగన్నాధ రావు, చింతకుంట్ల పెద్ద వెంకయ్య, మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు.










