ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా
ప్రజాశక్తి-కావలి రూరల్ : ప్రజా సమస్యలు పరిష్కరించాలని, పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను కరెంటు ఛార్జీలను ఇతర ఛార్జీలను తగ్గించాలని సోమవారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఒ శీనా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పైబడిందని అప్పటినుండి ఎన్నో సార్లు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, ట్రైన్ ఛార్జీలు ఇంకా అనేక రకాలుగా ఛార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలన్నారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను, పెట్రోలు, డీజల్ ధరలు తోపాటు కరెంటు ఛార్జీలు ఇంటి పన్నులు చెత్త పన్ను ఇతర యూజర్ ఛార్జీలను కూడా తగ్గించాలన్నారు. అలాగే వంటగ్యాస్ రూ.400లకు ఇవ్వాలని పేదలకు యూనిట్ కరెంట్ రూపాయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలు తగ్గించకపోతే రాబోవు రోజులలో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేసి ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు వై.కృష్ణమోహన్, జి.మధు సుధనరావు నాయకులు పి.తిరుపాలు, కె.జాన్, బి.కృష్ణయ్య, ఎస్‌కె.మస్తాన్, వి.బాబురావు, కె.చెన్నయ్య, మేడ వెంకటేశ్వర్లు, డివైఎఫ్‌ఐ నాయకులు నాగేశ్వరరావు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.










