Dec 17,2022 21:51

అరచేతిలో 'వైకుంఠం'

- పరిహారం కోసం రెండేళ్లుగా పడిగాపులు
- అమీతుమీకి సిద్ధమంటున్న పాగాలి రైతులు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి

'అవసరమున్నప్పుడు ఓడ మల్లన్న.. తీరాక బోడి మల్లన్న'' చందాన వ్యవహరిస్తోందీ ప్రభు త్వం. జగనన్న కాలనీల నిర్మాణం కోసం భూములు లాక్కుని, తీరా వారికి పరిహారమివ్వకుండా అర చేతిలో 'వైకుంఠం' చూపుతోంది. ఫలితంగా పరిహారం కోసం రెండేళ్లుగా పడిగాపులు కాస్తున్న ఏర్పేడు మండలం పాగాలి రైతులు ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవు తున్నారు. పరిహారం కాస్త పరిహాసం కాకముందే ప్రభుత్వం స్పందిం చాలనీ, లేకుంటే తమ భూములు లాక్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
రెండేళ్లుగా 'పడిగాపులు'
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాగాలి రెవెన్యూ లెక్క దాఖలాలో జగనన్న కాలనీ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం గతేడాది 130 ఎకరాలను సేకరించింది. ఫలితంగా పాగాలి, కుమ్మరిగుంట, మేర్లపాక గ్రామాలకు చెందిన 80 మంది రైతులు నిర్వాసితులయ్యారు. నిర్వాసితులైన ప్రతి రైతు కుటుంబానికి ఎకరాకు రూ.15.50 లక్షల నగదు, 3 సెంట్ల స్థలం ఇస్తామంటూ గ్రామ సభలు పెట్టి మరీ ఒప్పందం చేసుకుంది. అయితే ఒప్పందం చేసుకుని రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికి కేవలం 20 మంది రైతులకు మాత్రమే ఎకరాకు రూ.15.50 లక్షల చొప్పున పరిహారం అందింది. తక్కిన రైతులు 'మా డబ్బు మాకివ్వండి బాబో' అంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పడిగాపులు కాస్తున్నారు.
ముందే అప్పుల పాలు
'పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం' అన్న సామెత అచ్చు పాగాలి రైతులకు సరిపోలుతుందేమో పాపం. పరిహారం డబ్బులొస్తాయని ముందే అప్పులు చేసి పీకల్లోతు కష్టాల్లోకి కోరుకుపోయారు కొందరు రైతులు. తమతోటి రైతులకు పరిహారం అందడం..! అదకారులు రేపో మాపో అంటూ ఊరించడమే అందుకు కారణం. మేర్లపాక, కుమ్మరిగుంట, పాగాలి గ్రామాల్లో కొందరు రైతులు అధికారుల మాటలు నమ్మి ఈ రెండేళ్లలో రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు అప్పులు చేసినట్లు వాపోతున్నారు. దీంతో అప్పులోళ్ళు రోజూ ఇబ్బంది పెడుతున్నారనీ, కొందరు ఇళ్ళు కూడా జప్తు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమీ తుమీకి సిద్ధమంటున్న రైతులు
కాళ్ళు, కాళ్ళ చెప్పులు అరిగిపోయేలా తిరిగినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతులు తిరగబడేందుకు సిద్ధమవుతున్నారు. పరిహారం ఇవ్వలేదన్న బాధతో ఇటీవల కొందరు రైతులు జగనన్న లే అవుట్లలో సర్వే రాళ్ళను పీకేశారు. ఇంకొంతమంది మరింత ముందడుగు వేసి సుమారు 15 ఎకరాల్లో మినుము పంటలు సాగు చేస్తుండడం గమనార్హం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రైతులందరకీ పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకుంటే జగనన్న కాలానీని తిరిగి స్వాధీనం చేసుకుంటా మంటూ హెచ్చరిస్తున్నారు. రైతులకు అందాల్సిన అంశంపై ఏర్పేడు తహశీల్దార్‌ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.