May 13,2023 00:48

నోటిలో మంటలతో మ్యాజిక్‌ ప్రదర్శన

ప్రజాశక్తి-తాడేపల్లి : తన కళ్ల ముందుకు కూర్చున్న పిల్లలందరి ముందుు అరచేతిలో రూపాయి చూపించి అబ్రకదబ్ర అంటూ అంతలోనే రూపాయిని మాయం చేశారు ప్రముఖ ఇందజ్రాలికులు క్రాంతికార్‌. ఏమీలేని అరచేతి నుంచి పువ్వును తెప్పించారు. ఈ ప్రక్రియను మ్యాజిక్‌లో ఫామింగ్‌ అని అంటారు. ఓ అమ్మాయిని లేదా అబ్బాయిని పిలిచి తన చేతిలో ఉన్న రూపాయి నాణాన్ని వారి జడ నుంచి, జుట్టు నుంచి తెప్పించారు.మండుతున్న కర్పూరాన్ని అరచేతిలో పెట్టుకుని పిల్లల చేత నోట్లో వేసుకుని మింగేసే మ్యాజిక్‌ను విశ్రాంత ఎంపిడిఒ ఆదినారాయణ చేసి చూపించారు. పిల్లలు కేరింతలతో పాటు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. భారత్‌ అనే ఆరు ఇంగ్లీషు అక్షరాలను తీసుకుని వాటిని ఒక్కో అక్షరాన్ని చింపేసి మరలా ఒకే కాగితం మీద భారత్‌ వచ్చే విధంగా మ్యాజిక్‌ చేయించారు. బి అంటే బీహార్‌, హెచ్‌ హర్యానా, ఎ ఆంధ్రప్రదేశ్‌, ఆర్‌ రాజస్థాన్‌, ఎ అరుణాచల్‌ప్రదేశ్‌, టి తమిళనాడు అని చెబుతూ భారతదేశాన్ని విచ్ఛిన్నం కానివ్వబోమని, సమైక్యంగానే ఉంచుతామనే సందేశాన్ని ఈ మ్యాజిక్‌ షో ద్వారా పిల్లలకు తెలియజెప్పారు. ఈ సందర్భంగా క్రాంతికార్‌ మాట్లాడుతూ మ్యాజిక్‌ నేర్చుకోవడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, శాస్త్రీయ దృక్పథం అలవడుతుందని అన్నారు. ఎంటిఎంసి బాలోత్సవం కోశాధికారి గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ శిక్షణను 17వ తేదీ వరకూ నిర్వహిస్తామని చెప్పారు. నేర్చుకున్న అంశాలపై విద్యార్థులు మూడ్రోజులపాటు ప్రదర్శిస్తారని తెలిపారు. 18వ తేదీ విజయవాడ ఎంబివికెలో వందలాది మంది సమక్షంలో సమ్మర్‌ క్యాంపులో నేర్చుకున్న మ్యాజిక్‌ ప్రదర్శన ఉంటుందన్నారు.