Jun 11,2023 16:41

మాట్లాడుతున్న మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అంకిరెడ్డి

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో
త్వరలో అల్ట్రాసౌండ్‌ సేవలు
- ప్రతి నెలా 9న గర్భిణులకు హెల్త్‌ చెకప్‌
- ప్రజాశక్తితో నంద్యాల మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అంకిరెడ్డి ముఖాముఖి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      'నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో వైద్య సేవల మెరుగునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో అల్ట్రాసౌండ్‌ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఆల్ట్రాసౌండ్‌, టైపాయిడ్‌, డెంగ్యూ, మలేరియా వంటి పరీక్షలు చేయించుకోవాలంటే జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండానే దాదాపు 20 రకాల పరీక్షలు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. పేదవాడికి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లు వరం లాంటివి' అని మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అంకిరెడ్డి తెలిపారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల్లలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆయన ప్రజాశక్తితో ముఖాముఖీ మాట్లాడారు.
నంద్యాల పట్టణంలో ఏ ఏ ప్రాంతాల్లో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లు ఏర్పాటు చేశారు..?
మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ : ముఖ్యంగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లు స్లమ్‌ ఏరియాలలో ఏర్పాటు చేశాం. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో వైద్యులు అందుబాటులో ఉంటారు.
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లు ఉన్నాయి..?
మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ : నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 8 అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లు ఉన్నాయి. 5 కొత్త భవనాలు ఉన్నాయి మూడు బిల్డింగ్‌లకు నాడు-నేడు కింద మరమ్మతులు చేశాం.
అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో రోజుకు ఎన్ని ఒపిలు జరుగుతున్నాయి..?
మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ : రోజుకు 50 నుండి 60 వరకు ఒపిలు జరుగుతున్నాయి. వైద్య సేవలు బాగా అందిస్తున్నాం. ప్రతి నెలా 9వ తారీఖున గర్భిణులకు హెల్త్‌ చెకప్‌లు చేస్తున్నాం.
అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా..?
మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ : అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో వైద్య సిబ్బంది, వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారు. అలాగే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జనరల్‌ మెడిషిన్‌, పిడియాట్రిక్‌, ఆర్థోపెడిక్‌, జనరల్‌ పిజీషియన్‌ వంటి వైద్యులు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ను సందర్శించి వైద్య సేవలు అందిస్తారు.
అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో ఎన్ని రకాల వైద్యమ పరీక్షలు నిర్వహిస్తున్నారు..?
మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ : అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో ఈసిజి, ఎల్‌ఎఫ్‌టి హెల్త్‌ ఫ్రొఫైల్‌, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌, హెచ్‌ఐవి వంటి 20 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈజిసి టెస్టులు కూడా అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో నిర్వహిస్తున్నాం. ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, హరిజన వాడలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లో ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ : సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నాం. వచ్చేది వర్షాకాలం కాబట్టి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటిని కాచి చల్లార్చి వడబోసిన తర్వాతనే తాగాలి. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శానిటేషన్‌పైన దృష్టి పెడుతున్నాం. ఎల్‌సిడి, ఫీవర్‌ సర్వే ఇంటింటికి తిరిగి ఆశాలు, ఏఎన్‌ఎంలు చేస్తారు. సర్వే జరుగుతుంది.
వ్యాక్సినేషన్‌ ఏఏ వారాల్లో జరుగుతుంది..? నెలలో ఎన్నిసార్లు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉంటుంది..?
మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ : అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో ప్రతి నెల బుధవారం, శనివారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుంది. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు.
విలేజ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ : ప్రతి 2వ శుక్రవారం విలేజ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ పైన గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు న్యూట్రిషన్‌ ఆహారం అందిస్తున్నాం.