Sep 26,2023 21:00

ఆర్‌బికెలో కనిపించని బ్యాంకింగ్‌ సేవలు

 ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : ప్రజాప్రతినిధులు చెప్పినట్లు రైౖతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బికె) బ్యాంకు సేవలు కనిపించడంలేదు. రెండేళ్ల కిందట ఆర్‌బికెల్లో బ్యాంకు కర స్పాండెంట్ల(బిసి)ను నియమించి సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో రైతులు తమ కష్టాలు తీరుతాయని ఆశపడ్డారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతులు సాగు పెట్టు బడులతోపాటు, ఇతర సేవల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయా ల్సిన పరిస్థితి. ప్రొద్దుటూరు డివిజన్‌ పరిధిలో 55 ఆర్‌బికెలున్నాయి.
ప్రకటనలకే పరిమితం..
రైతులు బ్యాంకులకు వెళ్లనవసరం లేకుండా బ్యాంకు ప్రతి నిథుల(బిసి)ను నియమించి రైతు భరోసా కేంద్రాలకు మ్యాపింగ్‌ చేశారు. ఆన్‌లైన్‌ సేవలపై అవగాహన కల్పించారు. వీరికి బ్యాంకులే అవసరమైన సామగ్రిని సమకూర్చి రోజుకు రెండు గంటల పాటు రైతు భరోసా కేంద్రాల్లో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. వీరి ద్వారా రూ.10 వేల వరకు నగదు జమ, బదిలీ చేయవచ్చు. రూ.20 వేలు తీసుకొనేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా సేవలు అమలు కాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.
ఆన్‌లైన్‌ సేవలు లేకపోవడంతో..
ప్రొద్దుటూరు మండల పరిధిలోని కల్లూరు, ఉప్పరపల్లి, తాళ్లమాపురం, కాకిరేణిపల్లి, చౌడూరు రైతులు కూడా 12 నుండి 20 కిలో మీటర్ల దూరం పైబడి ఉన్న ప్రొద్దటూరు వచ్చి బ్యాంకు సేవలను విని యో గించుకోవాల్సి వస్తోంది. రైతులకు కూడా బ్యాంకులు 12 నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. బ్యాంకు సేవలకు ఇబ్బందులు పడుతున్నారు.
ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తేవాలి
రైతు భరోసా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చి రైతులను ఆదుకుంటే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే రైతు భరోసా కేంద్రాలున్నా నిరుపయోగమే. గతంలోలా ప్రతి చిన్న పనికి బ్యాంకుకు వెళ్లాల్సిందే. అందుకోసం ఒకరోజంతా కేటాయించాల్సి వస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెస్తే రైతులకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
- ఆకుమల్ల దావీదు, రైతు

త్వరలో బ్యాంకు సేవలు అందేలా చర్యలు
రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్‌ సేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ప్రభుత్వ ఆదేశానుసారం త్వరలోనే బ్యాంకు సేవలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
- సురేష్‌రెడ్డి, ఎడిఎ, ప్రొద్దుటూరు డివిజన్‌