
అధిక సొమ్ము దండుకుంటున్న ప్రయివేట్ వ్యాపారులు
ఆందోళన చెందుతున్న రైతులు
యురియా అందక రైతుల్లో ఆందోళన నెలకొంది. రైతు భరోసా కేంద్రాల్లో దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కొందరు డీలర్లు కృత్రిక కొరత సృష్టించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా కొంత మంది వ్యాపారులు ధరలు ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతుండటంతో రైతులకు ఆవేదన తప్పడం లేదు.
ప్రజాశక్తి-చిట్వేలి : మండలంలో యూరియా కొరత వేధిస్తోంది. అవసరం మేరకు యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తోటలకు ఎరువు వేసే సమయం దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు వ్యాపారులు కుమ్మక్కై కత్రిమ కొరత సష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవసరమైన ఎరువులు కావాల్సిన రైతులు కియోస్క్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందులో వివరాలు నమోదు చేసుకున్నా సకాలంలో ఎరువులు అందుబాటులోకి రాకపోవడంతో ఇటు అధికారులు అటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదును కోల్పోతే పంట చేతికి రాదనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైతులకు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అదును కోల్పోతే మొదటికే మోసం అవుతుందని భావించి ఖర్చులు భారమైన భరిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.270 విక్రయిస్తున్నారు. మండలంలో సాగు విస్తీర్ణంబట్టి ఎరువులు అందించాల్సి ఉంది. కానీ... అధికారుల లెక్కలకు పంటల విస్తీర్ణానికి అవసరమైన ఎరువులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఉద్యాన పంటలైన బొప్పాయి, మామిడి, అరటి, తదిరత పంటలకు అవసరమైన మేర యూరియాను వినియోగించాల్సి ఉంది. యూరియాకు కొరత ఏర్పడింది. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం రెండు విడతలకు ఎకరాకి 50 కిలోల కాంప్లెక్స్ ఎరువులు, వంద కిలోల యూరియా వేయాలి. రెండో విడతలో యూరియా అవసరాన్ని బట్టి వేస్తారు. కొన్నిచోట్ల ప్రైవేటు పెస్టిసైడ్స్ డీలర్లు కత్రిమ ఎరువుల కొరత సష్టించి రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
యూరియా దొరకడం లేదు
ఐదు ఎకరాలు బొప్పాయి, మామిడి, నిమ్మ చెట్లు సాగు చేశాను. పది రోజుల నుం,ఒ యూరియా కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నా. ఒక మూట కూడా దొరికే అవకాశం కనబడలేదు. ఈ సమయంలో యూరియాతో పాటు మరికొన్ని ఎరువులు వాడితే కానీ పూత దశ బాగుంటుంది. అధికారులు వెంటనే స్పందించి యూరియాను సరఫరా చేయాలి.
- కొల్లా గుండయ్య నాయుడు, రైతు, చిట్వేలి.