ప్రజాశక్తి-సామర్లకోట రూరల్
జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించాలని, పంట కోతలు అనంతరం కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా రోజూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కతిక అసిస్టెంట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, వ్యవసాయ, పౌర సరఫరాల, సహకార శాఖల అధికారులతో కలిసి సామర్లకోట మండలం ఉండూరు, వల్లూరు, జి.మేడపాడు తదితర గ్రామాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతుల నుంచి ధ్యానం శాంపిళ్ల సేకరణ, తేమ శాతం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలింపు, ధాన్యం రకాలు, గోనె సంచులు, హమాలీలు, రవాణా, ఎఫ్‌టఈవో జనరేషన్ వంటి అంశాలపై జిల్లా కలెక్టరు..అధికారులతో మాట్లాడారు. ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు సూచనలిచ్చారు. తొలుత సామర్లకోట మండలం ఉండూరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న తేమ శాతం యంత్రం పని తీరు, రైతుల రిజిస్ట్రేషన్ తదితరాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వల్లూరు గ్రామంలో వద్దిపత్తి శివరామకష్ణ పంట పొలంలో ధాన్యం రాశిని పరిశీలించారు. అనంతరం జి.మేడపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలోని గోనె సంచుల నిల్వ, రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను కలెక్టరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా అంతటా రబీ పంటకోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. ఇందుకు వ్యవసాయ, పౌరసరఫరాల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు మరింత అవగాహన కల్పించి, పంట కోత కోసిన వెంటనే ధాన్యం సేకరించే విధంగా ప్రతిరోజు ఉదయం గ్రామ వ్యవసాయ సహాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. బొండాలు రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కలెక్టరు వెంట జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజరు కుమార్, పౌరసరఫరాల సంస్థ డీఎం డి.పుష్పమణి, డీసీవో దుర్గాప్రసాద్, సామర్లకోట ధాన్యం కొనుగోలు ప్రత్యేక అధికారి పి.వసంత మాధవి, సామర్లకోట మండలం తహసీల్దార్ ఎస్.ఎల్.ఎన్.కుమారి, మండల వ్యవసాయాధికారి ఇమ్మిడిశెట్టి సత్య,మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ కృతికా శుక్లా










