Oct 25,2023 21:31

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి రైతులకు సేవలందించేందుకు జిల్లా వ్యాప్తంగా ఆర్‌బికెలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు నేపథ్యంలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు (బిసి) అవసరం ఉంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకుల కరస్పాండెంట్లు కనీసం రెండు గంటలు ఉండాలని ప్రణాళిక రూపొందించినా ఆచరణలో అమలుకు నోచుకోవటం లేదు. దీంతో రైతులకు నిరాశే మిగులుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాల సేవలను రైతులకు గ్రామస్థాయిలో అందించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. వీటితోపాటు బ్యాంకింగ్‌ సేవలు కూడా అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. సాధారణంగా ఐదువేల జనాభా ఉన్న ప్రాంతాల్లో బ్యాంకుల శాఖలను ఏర్పాటు చేసి సేవలందిస్తుంటాయి. తక్కువగా జనాభా ఉన్నచోట ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమించుకుని సేవలందిస్తున్నాయి. వారు గ్రామాల్లో ఆర్‌బికెల్లో కనీసం రెండు గంటలపాటు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రారంభంలో ప్రధాన బ్యాంకుల బిసిలు కొన్ని ఆర్‌బికెల్లో సేవలు ప్రారంభించారు. ఆ తరువాత వారి సేవలు దాదాపుగా దూరమయ్యాయి. జిల్లాలో 335 రైతు భరోసా కేంద్రాలు ఉండగా 55 మంది బ్యాంక్‌ కరస్పాండెంట్లు సేవలంది స్తున్నారు. మరో 285 కేంద్రాల్లో బ్యాంకు కరస్పాండెంట్లు లేనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అత్యధిక బ్యాంకుల్లో ఎక్కడా సేవలు కనిపించడం లేదు. ఆర్‌బికెలలో పలు రకాల సేవలందించాలని సూచించింది. రోజుకు రూ.20 వేల వరకు నగదు ఉపసంహరణతోపాటు జమ చేసే అవకాశ ఉంది. వేరే ఖాతాలకు బదిలీ చేయడం. ఇతర బ్యాంకు ఖాతాలకు మాత్రం రూ.10వేలు ఉపసంహరణ, బదిలీకు అవకాశం. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని గుర్తించడంతోపాటు గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించి నగదు స్వీకరణ చేయాల్సి ఉంటుది. లబ్ధిదారుల ఖాతాలకు సబంధించి నగదు వివరాల వెల్లడితోపాటు మినీ స్టేట్‌మెంటు అందజేయాలి. డిజిటల్‌, మొబైల్‌ లావాదేవీలు, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలపై అవగాహన తదితర కార్యకలాపాలకు ఆర్‌బికెలలో అవకాశం కల్పించారు. కానీ ఈ సేవలు పూర్తి స్థాయిలో అమలుకావడం లేదని రైతులు చెబుతున్నారు.. దీంతో గ్రామాల్లోని రైతులు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లేందుకు రైతులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. అక్కడి సిబ్బంది సరిగా సహకరించకపోవడంతో వ్యవసాయ రుణాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ప్రస్తుతం పూర్తి స్థాయిలో లేరు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాము. పిఆర్‌ విభాగానికి సూచించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రారభించిన నేపథ్యంలో బిసిల అవసరం ఉంది. త్వరితగతిన బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల నియామకం జరుగుతోంది. రైతులకు బ్యాంకింగ్‌ సేవలు అందుతాయి.