ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు నిలుస్తున్నాయని ప్రభుత్వం ఒక పక్క గొప్పలు చెబుతున్నా వాటి సేవలను పూర్తిస్థాయిలో అందించలేక పోతుంది. మూడేళ్లుగా ఆర్‌బికెల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో పలు ప్రాంతాల్లో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఎరువులు, పురుగు మందులు సక్రమంగా ఉండడం లేదు. నామమాత్రంగానే ఇతర సేవలు అందుతున్న నేపథ్యంలో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
అన్నదాతలకు అన్ని రకాల వ్యవసాయ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. ఆచరణలో కొన్ని రకాల సేవలు మాత్రమే అందించగలుగుతోంది. కాకినాడ జిల్లాలో 21 మండలాల్లో 385 ఆర్‌బికెలు ఉండగా వీటిలో 141 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటి సేవలను 2020 మే 30న ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 5 సెంట్ల స్థలంలో భవనం నిర్మించేందుకు ఒక్కో దానికి రూ.21.80 లక్షలు కేటాయించారు. వీటిలో 90 శాతం ఉపాధి హామీ పథకం నిధులు, 10 శాతం వ్యవసాయ శాఖ నిధులు వెచ్చించి భవనాలు నిర్మించాల్సి ఉంది. పాత పంచాయతీల భవనాలు, ఇతర అద్దె భవనాల్లో ప్రస్తుతం పలు ఆర్‌బికెలు నడుస్తున్నాయి. కొన్ని పూర్తి అయ్యి ప్రారంభించారు. గతంలో వ్యవసాయ సేవలు పొందాలంటే రైతులు మండల కేంద్రాలకు వ్యయప్రయాసలు పడుతూ వెళ్లేవారు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పల్లె ముంగిట్లోనే సేవలు అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాలు పని చేస్తున్నాయని పాలకులు, అధికారులు అంటున్నారు.
ఎప్పటికి పూర్తి అయ్యేనో..
మూడేళ్ల క్రితం భవనాలు మంజూరైనప్పటికీ నిర్మాణాలు పూర్తి కాలేదు. జిల్లాలో మొత్తం 385 భవనాలకు గానూ 36 భవనాల పనులు ఇంకా ప్రారంభమే కాలేదు.74 పునాదుల దశలో ఉండగా 53 బేస్ మెంట్ లెవెల్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. 38 స్లాబ్ వరకూ నిర్మాణాలు జరగ్గా, 59 స్లాబులు పూర్తయ్యాయి. 89 మాత్రమే భౌతికంగా పూర్తయ్యాయి. కరప మండలంలో 20 ఆర్‌బికెలు నిర్మాణాలు జరుగుతుండగా పాతర్లగడ్డ, గురజానపల్లి, పెద్దాపురప్పాడు, వేళంగి ప్రాంతాల్లో మాత్రమే పూర్తయ్యాయి. అరట్లకట్ల, కొంగోడు, నడకుదురు, ఉప్పలంక, వాకాడ, వేములవాడ, గ్రామాల్లో పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కరప, గొర్రెపూడి, కొరుపల్లి, సిరిపురం, పెనుగుదురు, యండమూరు గ్రామాల్లో పునాదుల దశలోనే నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో మూడేళ్లుగా నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. స్థానిక పంచాయతీ సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు వీటి నిర్మాణాలు చేపట్టగా బిల్లులు విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం మండలంలో 23 ఆర్‌బికెల నిర్మాణాలు జరుగుతుండగా మూడేళ్లలో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. జములపల్లి, గోకివాడ, నరసింగపురం, ఫక్రుద్దీన్‌పాలెం, కందరాడ, కుమారపురం, చిత్రాడ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు మధ్యలో ఉన్నాయి.అటు కాకినాడ రూరల్ మండలంలో వాకలపూడి, తమ్మవరం, పెనుమర్తి తదితర చోట్ల పునాదుల దశ దాటలేదు. కొన్ని మండలాల్లో పనులు ప్రారంభం కాగా, మరికొన్ని మండలాల్లో ప్రారంభానికి నోచుకోలేదు. దాంతో అరకొర వసతుల మధ్య సిబ్బంది ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు.










