
ప్రజాశక్తి- సబ్బవరం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలను, సేవలు సకాలంలో, సక్రమంగా అందించాలని అనకాపల్లి జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర హెల్త్ కమిషనర్ జె.నివాస్ ఆదేశించారు. మండలంలోని అమృతపురం రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌బికెల ద్వారా అందజేస్తున్న విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలను ప్రజల్లోకి అందేలా వ్యవసాయ సిబ్బంది కృషి చేయాలన్నారు. కస్టం హైరింగ్ సెంటర్లు (సిహెచ్‌సి), ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖల ద్వారా అందజేస్తున్న పథకాలపై సవివరంగా సమీక్ష నిర్వహించారు. ఈ పథకాలు రైతులకు సక్రమంగా అందుతున్నది, లేనిది రైతులతో సంభాషించి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుతున్న పథకాలపై రైతులు సంతతృప్తి వ్యక్తం చేయడంతో ప్రత్యేక అధికారి వ్యవసాయ శాఖ సిబ్బందిని అభినందించారు. ఈ సమీక్షలో కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, జిల్లా వ్యవసాయ అధికారి బి మోహన్ రావు, సర్పంచ్ బైలపూడి గౌరీ రామారావు, ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు, స్థానిక వ్యవసాయ అధికారి పోతల సత్యనారాయణ, ఏఈఓ బాలరాజు, గ్రామ వ్యవసాయ సహాయకులు పి. భావన పాల్గొన్నారు.