
పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో ఆర్‌బికెల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రకతి వ్యవసాయంపై మరింత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అరుణ్ బాబు, వ్యవసాయ సలహా మండలి జిల్లా ఛైర్మన్ ఆవుటాల రమణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు శంకర్ నారాయణ, సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ మంగమ్మ, జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాలు, మండల, జిల్లాస్థాయి సమావేశాలు తప్పనిసరిగా ప్రతినెలా నిర్వహించాలన్నారు. రాబోయే సీజన్లో రైతులకు మేలు చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని అనేది ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. నీటిపారుదల సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. అగ్రి అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ ప్రకతి వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. అధికారులందరూ సమన్వయంతో రైతులకు మేలు చేయాలన్నారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అన్నారు. ఎప్పుడూ లేని విధంగా రైతులకు అండగా ఉంటున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, సిరికల్చర్ జెడి పద్మమ్మ, మార్కెటింగ్ శాఖ అధికారి నరసింహమూర్తి, వ్యవసాయ పరిశోధన కదిరి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.