ప్రజాశక్తి-గుంటూరు : జిల్లా వ్యవసాయ సలహామండలి సలహా సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, జెడ్పీ చైర్‌పర్సన్ హెనీక్రిస్టినా, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శివరామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో గుర్తించిన 34,644 మంది కౌలు రైతులకు పంటరుణ అర్హత కార్డులు ఇప్పటి వరకూ మంజూరు చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి తెలియజేస్తూ 2389 మంది కౌలు రైతులకు రూ.15.35 కోట్ల పంట రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆర్‌బికె కేంద్రాల ద్వారా జింకు సల్ఫేట్ 21 శాతం సరఫరా చేయాలని జిల్లా చైర్మన్ కోరారు. సదరు జింకు సల్ఫేట్ 21 శాతం సరఫరాకు టెండర్లు పిలిచినట్లు ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ తెలిపారు. జిల్లాలో సాగు చేసిన అరటి పంటను పంటల బీమా కవరేజికి ప్రతిపాదించాలని వ్యవసాయ సలహా మండలి సభ్యులు ప్రతిపాదించారు. గ్రామాల్లోని డొంకరోడ్ల నిర్మాణం, మరమ్మతుకు ఏపీ మార్కెటింగ్ శాఖ ప్రభుత్వానికి అభ్యర్థన పంపించాలని జేసీ ఆదేశించారు. పంట కాల్వలు, డ్రెయినేజీ కాల్వలలోని పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ-క్రాప్ నమోదు చేసేటప్పుడు గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు తప్పనిసరిగా కచ్చితమైన పంట రకాన్ని నమోదు చేయాలని, తద్వారా పంట కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ 4760 ఎకరాలలో ఈ-క్రాప్ నమోదు చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి చెప్పారు.










