Nov 15,2023 21:49

తహశీల్దార్‌కు వినతిని అందజేస్తున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి - బలిజిపేట : రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గేదెల సత్యనారాయణ, రైతు కూలీ సంఘం నాయకులు మామిడి సింహాద్రినాయుడు డిమాండ్‌ చేశారు. బుధవారం పలు రైతు సమస్యలపై తహశీల్దారుకు వినతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర భూ సర్వే జరపాలని, తప్పులను సవరించాలని వారు కోరారు. సర్వే జరిగిన ప్రాంతాల్లో ఇంతవరకు 1-బిలు ఇవ్వకపోవడంతో రుణాలు పొందాల్సిన రైతులకు బ్యాంకు వారు రుణాల అందించడంలోనూ ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. సర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు 1బి సకాలంలో ఇవ్వకపోవడంతో పాత రుణాలు రెన్యువల్‌ చేసుకోవడంలో గానీ కొత్త రుణాలు పొందడానికి గానీ అవకాశం లేదని బ్యాంక్‌ అధికారులు తేల్చి చెప్తున్నారని, ఈ విషయంలో తహశీల్దారు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అధికారులు స్పందించి రైతు సమస్యలను తీర్చాలని, వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని కొనాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.