Nov 15,2022 00:10

మాట్లాడుతున్న రాజ్‌ కమల్‌


ప్రజాశక్తి-నక్కపల్లి:ఆర్‌బికే సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌ కమల్‌ సూచించారు. నక్కపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద సోమవారం పాయకరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో ఆర్‌బికే సిబ్బందికి మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణా ఇచ్చారు. వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌ కమల్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు మండలాల వ్యవసాయ శాఖ సిబ్బందికి క్షేత్రస్థాయిలో వివిధ వ్యవసాయ, ఉద్యానవన శాఖలో మేలైన యాజమాన్య పద్ధతులు, పొలంబడి, తోటబడి పై అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం, దృవీకరణ పై వ్యవసాయ అధికారి చిరంజీవి అవగాహన కల్పించారు. జిల్లా వనరుల కేంద్రం అనకాపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు టి.దాసు వరిలో సుడిదోమ తెగుళ్లు సేంద్రియ పద్ధతిలో తగ్గించవచ్చునని తెలిపారు. తూటీకాడ ఆకులు 10 కేజీలు, 10 లీటర్లు ఆవు మూత్రం కలిపి వేడి చేసిన మిశ్రమాన్ని ఫిల్టర్‌ చేసి ఒక ట్యాంకు ఒక లీటర్‌ చొప్పున పిచికారి చేయడంతో పూర్తిగా తగ్గించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్‌, ఉద్యానవన అధికారి ఉమామహేశ్వరి, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు చిరంజీవి, అరుణకుమారి, అధినారాయణ, ఏఈఓలు, వివిధ మండలాల ఆర్‌బికే సిబ్బంది, ఎంపిఎఓలు పాల్గొన్నారు.