ప్రజాశక్తి- కూనవరం
పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తక్షణమే ఇవ్వాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ హెచ్చరించారు. కూనవరంలోని మార్త శ్రీరామ్మూర్తి భవన్‌లో కొమరం పెంటయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన సిపిఎం మండల జనరల్ బాడీ సమావేశంలో కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వసితుల పట్ల నిర్లక్ష్య ధోరణితో, మోస పూరితంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు, కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా గతేడాది జులైలో వచ్చిన వరదలను అంచనా వేసి, వాటికి అనుగుణంగా రాబోయే బడ్జెట్‌లో ప్రతి నిర్వసితుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ప్యాకేజీ ఇచ్చిన భూములకు రూ.5లక్షలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ ఎవరికీ ఇవ్వక పోవడం ప్రభుత్వ మోసపూరిత మాటలకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, మండల కమిటీ సభ్యులు కుంజా రాధ, జ్యోతి, బొర్రయ్య, సుబ్బయ్య, శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు తలగాని నాగరాజు, సర్పంచ్ సోదే శంకర్, ఎంపీటీసీ అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.










