ఆరాధనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం, 1991 లోని నిర్దిష్ట నిబంధనల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై కేంద్రం అభిప్రాయాన్ని కోరాలని ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయం సరైన లీగల్ పద్ధతి ప్రకారమే వున్నట్టు కనపడినా దేశ విశాల ప్రయోజనాల కోసం నిలిచే వారంతా ఈ విషయంలో సరైన రీతిలో జోక్యం కల్పించుకోవలసి వుంది.
ఆరాధనా స్థలాలు లేదా యాత్రా స్థలాల స్వభావాన్ని యథాతథ స్థితిలో కొనసాగించేందుకు ఈ చట్టంలోని 2,3,4 సెక్షన్లు ''ఏకపక్షంగా, సహేతుకం కాని రీతిలో రెట్రోస్పెక్టివ్ కటాఫ్ తేదీని విధించాయంటూ'' పిటిషన్ పేర్కొంది. ఏ మతానికి చెందిన ఏ ఆరాధనా స్థలమైనా అదే మతంలోని మరో వర్గం ఆధిపత్యం గల ఆరాధనా స్థలంగా గాని, లేదా భిన్నమైన మతానికి చెందిన ఆరాధనా స్థలంగాగాని మార్చడాన్ని ఈ చట్టంలోని సెక్షన్ 3 నిషేధిస్తోంది. ఒక ఆరాధనా స్థలం మత స్వభావాన్ని మార్చడానికి సంబంధించి ఏ చట్టపరమైన కార్యకలాపాలన్నైనా అడ్డుకోవాలి, ఒకవేళ ఏ కోర్టు, ట్రిబ్యునల్ లేదా మరే ఇతర అథారిటీ వద్దనైనా అటువంటి కార్యకలాపాలేమైనా ప్రారంభమై వుంటే వాటిని అలాగే పెండింగ్‌లో వుంచాలని సెక్షన్ 4(ఇ) పేర్కొంటోంది. వాస్తవానికి, భారతదేశంలోని అన్ని మతాల ఆరాధనా స్థలాల మతపరమైన స్వభావాలు స్వాతంత్య్రం వచ్చిన నాటి పరిస్థితులనుబట్టి నిర్ధారితమై వున్నాయి. ఏ ఒక్కరూ వాటిని మార్చలేరు. ఒకవేళ మార్చాలని కోరుతూ ఏ పిటిషన్ అయినా దాఖలైనా ఏ కోర్టు కూడా విచారణకు స్వీకరించలేదు. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదమొక్కటే ఈ చట్టానికి వున్న ఏకైక మినహాయింపు.
హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులకు చెందిన ఆరాధనా స్థలాలు అక్రమంగా ఆక్రమణకు గురైనా వాటికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలను లేకుండా ఈ చట్టం చేస్తోందని పిటిషనర్ ఆరోపించారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశమేమంటే, బిజెపి సభ్యుడైన పిటిషనర్ ఒక కీలకమైన పాయింట్‌ను లేవనెత్తారు. సమానత్వం, మత ప్రాతిపదిక వివక్ష, వర్గం, కులం, లైంగికత, లేదా జన్మ స్థలం, ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ, వృత్తి స్వేచ్ఛ, మతాన్ని ఆచరించడం, లేదా ప్రచారం చేయడం, మత వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన స్వేచ్ఛ, మైనారిటీల ప్రయోజనాల రక్షణ వంటి అంశాలకు సంబంధించి రాజ్యాంగం లోని కీలకమైన అధికరణలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. పైగా, రాజ్యాంగ పీఠికలో అంతర్భాగమైన, మన రాజ్యాంగం మౌలిక స్వభావమైన లౌకికవాదం సూత్రాలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని 'పిల్' ఆరోపిస్తోంది.
మామూలుగా చూస్తే...న్యాయం కావాలంటూ 'పిల్' అమాయకంగా డిమాండ్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ, వాస్తవానికి, ఇది తర్కాన్ని ఇది తలకిందులు చేస్తోంది. మతపరమైన ఛాందసవాదులు, విధ్వంసకారుల (గతేడాదే వారిని ఆ నేరం నుండి ట్రయల్ కోర్టు విముక్తులను చేసింది) బృందం బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన నేపథ్యంలో పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించింది. స్వతంత్ర భారతావనిలో అత్యంత పాశవికమైన, దారుణమైన చర్యల్లో ఒకటిగా పేర్కొనే ఈ ఉదంతాన్ని మౌనంగా చూస్తూ ఊరుకున్నారని పి.వి.నరసింహారావు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించేందుకు పి.వి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకు వచ్చింది. చట్టబద్ధ పాలనను గౌరవించడం, న్యాయపరమైన ఆదేశాల పవిత్రత వంటి మౌలిక భావనల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా బాబ్రీ మసీదును కూలగొట్టారు. అవే శక్తులకు ఇతర నిర్మాణాలు కూడా లక్ష్యం కారాదని ఈ చట్టం రూపొందించారు.
చరిత్రలో వెనక్కి వెళ్ళి, జరిగిన ప్రతీ తప్పును సరిదిద్దడం ద్వారా నాగరికతలు మనుగడ సాగించవు, వృద్ధి చెందవు. గత కాలపు చరిత్రలోకి వెళ్లి అప్పుడు జరిగిన 'తప్పు'లన్నింటినీ ఇప్పుడు సరిదిద్దుతామనే వైఖరి తీసుకుంటే ఏ నాగరికతా బతికి బట్టకట్టలేదు. ముందుకు సాగనూ లేదు. కాలంతోబాటు తప్పొప్పుల కొలబద్దలూ మారతాయి. ఆ మారుతున్న కాలంతో సంబంధం లేకుండా మతపరమైన వివాదాలను ముందుకు తెచ్చి భవిష్యత్తు తరాలనన్నింటినీ ఆ వివాదాలలో భాగస్వాముల్ని చేయగలిగినంత 'తీరుబాటు', 'సౌలభ్యం' మన దేశానికి లేదు. అందులోనూ పేదరికాన్ని, అవిద్యను, అనారోగ్యాన్ని అత్యధిక ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులలో అసలే లేదు. ఈ అతి సాధారణ వాస్తవాన్ని సుప్రీంకోర్టు గుర్తించుకోవడం మంచిది.
/ 'డెక్కన్ క్రానికల్' సంపాదకీయం /










