ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాష్ట్రంలో వైసిపి పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి జాడలేదని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 'భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర' టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి నశీర్ అహ్మద్ ఆధ్వర్యంలో సోమవారం వివిధ ప్రాంతాల్లో జరిగింది. కన్యకాపరమేశ్వరి దేవాలయం వద్ద బస్సు యాత్రను ప్రారంభించగా అనంతరం పాత గుంటూరు పోలీస్‌స్టేషన్, ఎన్టీఆర్ ఐలాండ్, మూతపడిన అన్న క్యాంటీన్, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ, పాడుబడిన గుంటూరు నగరపాలక సంస్థ భవనాలు, బీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ మానస సరోవరం వద్ద మాజీమంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. సంగడిగుంట వద్ద జరిగిన రచ్చబండలో పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ బటన్‌లు నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నాని, అయితే సంక్షేమ పథకాల పేరుతో అప్పులు తెచ్చి ఆ తర్వాత ఇష్టారీతిన దోచుకుంటున్నారని విమర్శించారు. టిడిపి హయాంలో గుంటూరులో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు నగరం అధోగతికి వెళ్లిపోయిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఆపేశారని, ఇది ప్రజాదోహంతో సమానమని ధ్వజమెత్తారు. నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ అన్ని వర్గాల శ్రేయస్సు కోసమే టిడిపి మినీ మేనిఫెస్టో రూపొందించిందన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టిడిపి చేపట్టిన సంక్షేమ పథకాలు రద్దుచేసి కొద్ది మందికి జగన్ పథకాలు ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు టి.శ్రావణ్‌కుమార్, జి.వి.ఆంజనేయులు, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, డాక్టర్ చదలవాడ అరవిందబాబు, దాసరి రాజామాస్టారు, ఆర్.సాయి, బి.రాంప్రసాద్ పాల్గొన్నారు.










