Nov 16,2023 23:26

ప్రజాశక్తి - పర్చూరు
అరాచక వైసిపి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు జనసేన, టిడిపి శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగుతామని టిడిపి బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు, ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు అన్నారు. స్థానిక రోటరీ భవన్లో గురువారం ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఇరుపార్టీల కార్యకర్తలు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ వైసీపీ నాలుగున్నర ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎవ్వరూ సంతోషంగా లేరని అన్నారు. కోటి ఆశలతో అధికారం ఇస్తే ప్రజలను నరకయాతనకు గురి చేశారని మండిపడ్డారు. ప్రజలంతా ప్రజా ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. జగన్ పాలన వ్యవస్థలన్నీ ధ్వంసం చేశాడని అన్నారు. అభివృద్ధి జరగకపోగా విధ్వంసం, దౌర్జన్యం, అరాచకం రాజ్యమేలుతుందని అన్నారు. టిడిపి ప్రభుత్వ కాలంలో పర్చూరు నియోజకవర్గాన్ని ససస్యశ్యామలం చేసేందుకు రూ.275కోట్లతో గుంటూరు ఛానల్ పొడగింపుకు నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. కానీ ఈ అరాచక ప్రభుత్వం విధ్వంసంలో భాగంగా టెండర్లను నిలిపివేసి పనులను రద్దు చేసిందని అన్నారు. జనసేన ఇన్‌ఛార్జి పెద్దపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరు సాగిద్దామని అన్నారు. వర్షాలు లేక ఎండుతున్న పంటలకు రూ.100కోట్ల నష్టపరిహార నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని ఉమ్మడి సమావేశం తీర్మానించిందని తెలిపారు.