Jul 22,2023 21:55

పార్వతీపురంలో మానవహారం చేస్తున్న విద్యార్థులు, మహిళలు, నాయకులు

ప్రజాశక్తి - పార్వతీపురంరటౌన్‌/బెలగాం : మణిపూర్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు ప్రధానమంత్రి మోడీ పూనుకోవాలని, హింసను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న అరాచకశక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం స్థానిక పాత బస్టాండ్‌ వద్ద ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి, శ్రామిక మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిరా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాజు, కార్యదర్శి పి. రాజశేఖర్‌ మాట్లాడారు. గత మూడు నెలల నుండి మణిపూర్లో మైతే, కుకి తెగల మధ్య మొదలైన హింసకాండ వల్ల 150 మంది హత్య చేయబడ్డారని, ప్రతి రోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, అనేకమంది కుకి తెగకు సంబంధించిన గిరిజనుల ఇళ్లను తగలబెట్టారని, ఇంత విధ్వంసం జరుగుతున్నా ప్రధాని మోడీ కనీసంగా స్పందించకపోవడం చూస్తే మణిపూర్లో జరుగుతున్న హింస కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కార్గిల్‌ అమరవీరుల భార్యను నగంగా ఊరేగించి, అత్యాచారం అనంతరం హత్యచేసిన ఘటనకు భారతదేశం తలదించుకునేలా ఉందని, మోడీ సిగ్గుపడాలని అన్నారు. ఇలా బయటకు రాకుండా జరిగిన అనేక అఘాయిత్యాలకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నేడు మత కలహాలుగా మారి చర్చిలు తగలబెడుతూ, క్రిస్టియన్‌ ఫాస్టర్లను చంపుతున్నారని, ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం బీజేపీ హిందుత్వ ఎజెండాలో భాగంగానే జరుగుతుందన్నారు. తక్షణం అల్లర్లకు పాల్పడే అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుని మాణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. మేధావులు, ప్రజాస్వామికవాదులు, దేశ సమైక్యతను కోరుకునేవారు తక్షణం మోడీ ప్రభుత్వ మతోన్మాద చర్యలను ఖండించాలని, లేకపోతే మణిపూర్‌ ప్రయోగం దేశవ్యాప్తంగా బీజేపీ, ఆరెస్సెస్‌ విస్తరణకు పూనుకుంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్‌ సింహాచలం, ఐద్వా వెంకటమ్మ, గౌరి, జానకి, సంతోషి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
పాలకొండ, పాలకొండ రూరల్‌: మణిపూర్‌ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు ప్రధానమంత్రి మోడీ పూనుకోవాలని, హింసను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు పాలకొండ సమన్వయ కమిటీ కార్యదర్శి కాద రాము ఆధ్వర్యంలో శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ అవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు మాట్లాడుతూ తక్షణమే అల్లర్లకు పాల్పడే అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుని మాణిపూర్‌లో శాంతిని నెలకొల్పా లని డిమాండ్‌ చేశారు. మేధావులు, ప్రజాస్వామికవాదులు, దేశ సమైక్యతను కోరుకునేవారు తక్షణం మోడీ ప్రభుత్వ మతోన్మాద చర్యలను ఖండించాలని, లేకపోతే మాణిపూర్‌ ప్రయోగం దేశవ్యాప్తంగా బీజేపీ, ఆరెస్సెస్‌ అమలుచేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు, ఆటో కార్మిక సంఘం ప్రతినిధులు కె. రామకష్ణ, కె.సూర్య, బి.పోలినాయుడు, బి.దుర్గారావు, ఎన్‌.శ్రీను, టి. దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
బుక్కూరులో...
మణిపూర్‌ మహిళలపై హింసను ఆపాలని ఐద్వా బుక్కురు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.హిమప్రభ మాట్లాడుతూ మణిపూర్‌ మారణ హౌమాన్ని ఆపాలని, మహిళలపై అమానుష ఖండపై పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, మే 4న అఘాయిత్యం జరినప్పటికి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినంత వరకు ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయకపోవడం శోచనీయమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మౌనం వీడి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జి.పద్మావతి, సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: మణిపూర్‌లో గత మూడు నెలలుగా జరుగుతున్న మారణహౌమంపై రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడంలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్నై నాయుడు అన్నారు. శనివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు, మహిళల అత్యాచారాలు, నగంగా ఊరేగింపు లు జరుగుతుంటే టిడిపి, వైసిపి, జనసేన అధినేతలు మౌనం వహిస్తుండడం సరికాదని చెప్పారు. బిజెపి అడుగులకు మడుగులొత్తే పనిలో వున్న ఎపి రాజకీయ పార్టీలు వున్నాయని అన్నారు. కులం,మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్న బిజెపి ప్రభుత్వం మణిపూర్‌ హింసాత్మక సంఘటనలకు బాధ్యత వహించాలని, ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేయాలని ఎన్వై నాయుడు డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిపిఎం నాయకులు ఉమాశంకర్‌ పాల్గొన్నారు.