ప్రజాశక్తి-కాకినాడ వైసిపి అరాచక పాలనపై పోరాటమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు పని చేస్తాయని ఆ పార్టీల నాయకులు తెలిపారు. బుధవారం స్థానిక హోటల్లో జనసేన పార్టీ సిటీ ఇన్‌ఛార్జి ముత్తా శశిధర్, పెద్దాపురం ఇన్‌ఛార్జి తుమ్మల బాబు, టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సిటీ ఇన్‌ఛార్జి వనమాడి కొండబాబు మాట్లాడారు. తమ నాయకుడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు ముందే జనసేన, టిడిపి కలిసి అరాచక పాలనపై పోరాటం చేస్తామని చెప్పామన్నారు. ఈ లోగా చంద్రబాబును అక్రమ నిర్బంధం చేశారని వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం ప్రకటించి వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జనసేన, టిడిపి, కలిసి పోరాడాలని పిలుపునిచ్చారన్నారు. ఈ పిలుపు మేరకు సోమవారం పవన్ కల్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజమహేంద్రవరంలో మొదటి సమావేశం నిర్వహించారన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారని దానికి అనుగుణంగా ఈ నెల 29న కాకినాడ వేదికగా సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన రెండు పార్టీలకు చెందిన నాయకులు అందరూ పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి సిటీ అధ్యక్షుడు మళ్లిపూడి వీరు, జనసేన నాయకులు తలాటం సత్య ఉన్నారు.










