ప్రజాశక్తి - ఆదోని
వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు, జనసేన ఇన్‌ఛార్జీ మల్లప్ప కోరారు. బుధవారం ఆదోనిలోని టిడిపి కార్యాలయంలో టిడిపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంతకుముందు జనసేన కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు టిడిపి కార్యాలయం వరకు శ్రీనివాస్ భవన్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాబోవు ఎన్నికల్లో కలిసి పోటీ చేసి జనసేన టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు. ఆదోనిలో జనసేన, టిడిపి జెండాలు ఎగిరే విధంగా టిడిపి, జనసేన కార్యకర్తలు సమన్వయంతో కలిసి పని చేయాలని ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలను కోరారు. ఉమ్మడి మేనిఫెస్టోలో అంశాలను ప్రతి గడపకూ తీసుకెళ్లి ఉమ్మడి ప్రభుత్వంలో జరిగే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అలాంటి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జనసేన, టిడిపి కలయికతో అధికార వైసిపిలో ఆందోళన మొదలైందన్నారు. నియోజకవర్గంలో జనసేన, టిడిపి జెండా ఎగరడానికి కృషి చేస్తామని, నియోజకవర్గ సమస్యలపైనా ఇరు పార్టీల సమన్వయంతో పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, సయ్యద్ అప్సర్ బాష, వాల్మీకి వెంకటేష్, వీరేష్, మాబాష, జయరామ్, సుబ్బు, మల్లి, చాగి మల్లికార్జున్‌రెడ్డి, మదిరే వీరేష్, జనసేన నాయకులు రేణు వర్మ, వంశీ చైతన్య మేనేజింగ్ డైరెక్టర్, జనసేన నాయకులు రమేష్ యాదవ్, రాజశేఖర్, తాహెర్ వలీ, పులి రాజు, జయరామ్, టిడిపి నాయకులు జగదీష్, రామాంజనేయులు ఉన్నారు.