ప్రజాశక్తి-మార్టూరు రూరల్: అరాచక పాలనకు అంతం పలకటమే లక్ష్యంగా అశేష జనావళి అడుగులతో యువగళం ముందుకు సాగుతుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఈ నెల 11న యువనేత లోకేష్ యువ గళం పాదయాత్ర 2,000 కిలోమీటర్లకు చేరుకుంటున్న నేపథ్యంలో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా సంఘీభావ యాత్రలను విజయవంతం చేయాలని ఏలూరి పిలుపు నిచ్చారు. ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ భవిష్యత్తుకు భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగుతున్నారన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోం దన్నారు. 5కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో జనగళమే యువగళమై సాగుతున్న ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుం దన్నారు. వడివడిగా అడుగులు వేస్తూ.. లక్షలాది ప్రజల ఆశీస్సులు అందుకుంటూ 153 రోజుల్లోనే యువనేత లోకేష్ 50 శాతం లక్ష్యాన్ని అధిగమించారని అన్నారు. జన ప్రభంజనంతో, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న యువగళానికి ప్రజల నుంచి రోజురోజుకూ అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. జనసంద్రంగా సాగుతున్న యువగళం యాత్ర అధికారపార్టీ పెద్దలకు కంటి మీద కునుకులేకుండా చేస్తుందని ఏలూరి అన్నారు. లక్షలాది ప్రజలను నేరుగా కలుస్తూ, అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ, కన్నీళ్లు తుడుస్తూ లోకేష్ చేస్తున్న పాదయాత్ర అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తోందన్నారు. యువగళం పాదయాత్రను అడ్డుకునేం దుకు అధికార పార్టీ సకల ప్రయత్నాలు చేసినప్పటికీ ఉక్కు సంకల్పంతో సాగుతున్న యువగళం జైత్రయాత్రను అడ్డుకోవడం వారి తరం కాలేదన్నారు. 153 రోజుల యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ సుమారు 30 లక్షల మంది ప్రజలను నేరుగా కలుసుకుని, 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1,297 గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. యువనేత పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల నుంచి 2,895 రాతపూర్వక వినతిపత్రాలు అందాయన్నారు. రచ్చబండ కార్యక్రమాలకు పల్లెప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. యువగళం పాదయాత్ర రాయల సీమలో చరిత్ర సృష్టించిందని, గతంలో మరే నాయకుడు చేయని విధంగా రాయలసీమలో 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1,587 కిమీ పాదయాత్ర చేసి లోకేష్ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతున్న తరుణంలో రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుపార్టీ విజయదుందుభి మోగించడంతో అధికారపార్టీలో యువగళం గుబులు మొదలైందన్నారు. యువ నేత చేపట్టిన యాత్ర రాష్ట్ర చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతుందన్నారు. తెలుగుదేశం ప్రభంజనానికి యువగళం జనగళం కానుందన్నారు. సంఘీభావ యాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఏలూరి పిలుపునిచ్చారు.










