పలాస : మండలం రేగులపాడు ఆఫ్‌షోర్ రిజర్వాయర్ త్వరితగతిన పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని, ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు అప్పయ్యదొర నామకరణం చేయాలని ప్రముఖ న్యాయవాది వరిశ బాలకృష్ణ అన్నారు. దివంగత ఎంపి హనుమంతు అప్పయ్యదొర బాటలో నడిస్తే మంచి నాయకులుగా గుర్తింపు పొందుతారని, ఆ దిశగా ప్రయాణం చేయాలని హనుమంతు విజయకుమార్ దొర (చిట్టి)కు సూచించారు. కాశీబుగ్గ అప్పయ్య దొర ఇంటి వద్ద ఆదివారం నిర్వహించిన దొర అభిమానుల ఆత్మీయసభ విజయవంతమైంది. ఈ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ అప్పయ్యదొర పదవుల కోసం రాజకీయం చేయలేదని, ప్రజల సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేసి మంచి నాయకుడిగా నిలిచారన్నారు. దొర పెట్టిన బిక్షవల్లే తాను ఈ స్థానంలో ఉన్నానన్నారు. దొర తనయుడుగా పుట్టడం చిట్టిదొర ఆదృష్టమన్నారు. అప్పయ్యదొర తనయుడు విజయకుమార్ దొర మాట్లామడుతూ మన ప్రాంతానికి దొర దేవుడు ఇచ్చిన దైవమని, దొర జెండాయే మా అజెండా అని, ఈ సభ ఎంతో విజయవంతం కావడం తనకు మరింత మనోదైర్యం, ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. సమావేశంలో సినీ నిర్మాత బలగ ప్రకాష్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చాపర సుందరలాల్, డాక్టర్ వై.రామినాయుడు. మజ్జి పున్నయ్య, పైల జవహర్, మరడ భాస్కరరావు, వెంకటరావు, మూర్తి, సిర్ల రవిచంద్ర పాల్గొన్నారు.