ఆఫ్రాన్ మరమ్మతులు చేపట్టాలి
ప్రజాశక్తి-అనంతసాగరం : సోమశిల జలాశయం దెబ్బతిన్న ఆఫ్రాన్ మరమ్మతుల చేపట్టాలని సిపిఎం జిల్లా నాయకులు చండ్ర రాజగోపాల్ పేర్కొన్నారు. రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సోమశిల జలాశయం పూర్తిగా దెబ్బతిని, కింది భాగమైన ఆఫ్రాన్ పూర్తిస్థాయిలో దెబ్బతిందన్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా అవివేక ఆలోచనల వల్ల పూర్తిస్థాయిలో సోమశిల జలాశయంలో నీటిని నిలువ చేయడం వల్ల వరద తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కసారి గేట్లు ఎత్తడంతో ఆఫ్రాన్ పూర్తిగా దెబ్బతిందన్నారు. జిల్లా వరప్రసాది అయిన జలాశయం నాశనమైతే జిల్లా రైతాంగం బతకలేరని తెలిపారు. సోమశిల జలాశయం మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించిందని, కానీ బడ్జెట్లో కేటాయింపులు జరగకపోవడంతో మరమ్మతుల పనులు ఆగిపోయాయని తెలిపారు. ప్రభుత్వం మరమ్మతుల కోసం కేటాయించిన రూ.100 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సోమశిల డైవర్షన్ కాలువను మొదట మరమ్మతులు చేస్తుంటే ఆ కాలువ ద్వారా డెల్టా రైతాంగానికి 10000 క్యూసెక్కుల నీరు అందించే అవకాశం ఉండేదన్నారు. వెంటనే ప్రభుత్వం సోమశిల జలాశయం మరమ్మతులు పూర్తి చేసి జిల్లా రైతాంగాన్ని కాపాడాలని కోరారు. సోమశిల జలాశయంపై సమగ్రమైన దర్యాప్తు నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, చంద్రమౌళి, గండవరపు సీనయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు గంటా లక్ష్మీపతి, రైతు సంఘం నాయకులు లక్కు ప్రసాద్, ఉప్పలపాడు మస్తాన్, సిపిఎం అనంతసాగరం కార్యదర్శి అన్వర్ బాషా, నాగులపాటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.










