ఆఫ్ఘనిస్తాన్ భవితవ్యం ఆందోళనకరంగా ఉంది. అమెరికా బలగాల ఉపసంహరణ ఈ ప్రాంత అనిశ్చితికి మరింత ఆజ్యం పోసింది. ఆఫ్ఘనిస్తాన్‌కు చైనాతో 90 కిలోమీటర్ల మేర సరిహద్దు వుంది. అందుకే ఆ దేశంలో జరిగే పరిణామాల పట్ల చైనా ఆందోళనతో ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అస్థిరత, హింస చైనా భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి.
2001లో ఆఫ్ఘనిస్తాన్‌ను అమెరికా ఆక్రమించుకున్నప్పటి నుండి, ఆ దేశం గురించి చైనా పెద్దగా దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడూ ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించడం, ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం వంటి వాటికే అది పరిమితమైంది.
ఆఫ్ఘన్ నుండి బలగాల ఉపసంహరణ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుండి చైనా రంగం మీదికి వచ్చింది. 2017లో, చైనా-ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ త్రైపాక్షిక సహకార చర్చలు జరిగాయి. పాక్-ఆఫ్ఘన్ సంబంధాల్లో ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. 2020 జూన్‌లో నాల్గవ దఫా త్రైపాక్షిక చర్చలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు తాలిబన్లు తీసుకునే వైఖరిని బట్టి త్రైపాక్షిక చర్చల భవితవ్యం ఆధారపడివుంది.
''2019లో చైనా ఆఫ్ఘన్ వస్తువులకు అయిదవ అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా వుంది. తొలి నాలుగు స్థానాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), పాకిస్తాన్, భారత్, అమెరికా వున్నాయి. ఆఫ్ఘన్ మార్కెట్లకు నాల్గవ అతి పెద్ద దిగుమతి వస్తువుల కేంద్రంగా కూడా వుంది. తొలి మూడు స్థానాల్లో యుఎఇ, పాకిస్తాన్, భారత్ వున్నాయి.
అమెరికా బలగాల ఉపసంహరణ, తాలిబన్లకు అకస్మాత్తుగా రాజకీయ అవకాశాలు దక్కిన నేపథ్యంలో, చైనా తన పొరుగు దేశం పట్ల ఆచరణాత్మక వైఖరిని అనుసరించింది. తాలిబన్లతో సంబంధాలు నెరపడానికి విముఖత ప్రదర్శించలేదు. చైనా దేశీయ, ప్రాంతీయ ప్రయోజనాలకు భంగం కలిగించని ఏ ప్రభుత్వంతోనైనా సహకరించడానికి సిద్ధంగా వున్నట్లు తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవడానికి ముందుగా, గ్రూపు ముఖ్య ప్రతినిధి బృంద నేత ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ నేతృత్వంలోని తాలిబన్ అగ్ర నేతలకు చైనా ఆతిథ్యమిచ్చింది. ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోబోదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ స్పష్టం చేశారు. ఘర్షణలను విరమించి, ఆఫ్ఘన్ పక్షాల మధ్య చర్చల క్రమాన్ని వేగిరపరచాలని, దేశాన్ని మరో తీవ్రవాద కేంద్రంగా మారకుండా నివారించాలని వాంగ్ వివిధ ఆఫ్ఘన్ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. తీవ్రవాద శక్తులతో గల సంబంధాలన్నింటినీ మొత్తంగా విడనాడాలని వాంగ్ తాలిబన్లను కోరారు. ఆఫ్గనిస్తాన్‌కు నాయకత్వం వహించగల బాధ్యతాయుతమైన రాజకీయ విభాగంగా వ్యవహరించాలని సూచించారు.
తాము సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని చైనాకు తాలిబన్లు హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఇప్పటికే చైనా, ఆఫ్ఘన్ పొరుగుదేశమైన పాకిస్తాన్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ అయిన ది ఆఫ్ఘన్ బ్యాంక్‌లో దాదాపు 950కోట్ల డాలర్లు విలువచేసే ఆస్తులను అమెరికా స్తంభిపంచేసినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌కు నగదు తరలింపును అడ్డుకుంది. డబ్బు అందుబాటులోకి రాకుండా ఐఎంఎఫ్ కూడా అడ్డుకుంది. చైనా తమకు ముఖ్య భాగస్వామి మాత్రమే కాదు, తమకు ఉన్న అసాధారణ అవకాశం కూడా అని తాలిబన్లు పేర్కొన్నారు. ఆఫ్ఘన్‌లో పెట్టుబడులు పెట్టడానికి, దేశ పునర్నిర్మాణానికి సిద్ధంగా వున్నానని చైనా స్పష్టమైన హామీ ఇచ్చిందని అన్నారు. అమెరికాతో భాగస్వామ్యం ఎప్పుడూ ఉద్రిక్తంగానే వుంటుందని తాలిబన్లు అర్ధం చేసుకున్నారు. చైనా మద్దతు పొందాలంటే తాలిబన్లు దేశ వ్యవహారాలను చక్కదిద్దడంతో బాటు సమర్ధవంతమైన, చట్టబద్ధమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించాల్సి వుంది.
''అమెరికా బలగాల ఉపసంహరణ తరువాత ఆఫ్ఘనిస్తాన్‌కు అత్యంత ఆవశ్యకమైన రాజకీయ నిష్పాక్షికత, ఆర్థిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా ముందుకొచ్చింది. దీనికి ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ కూడా కొన్ని చర్యలు చేపట్టింది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమల నిర్మాణ రంగంలో చైనాకు గల సామర్ధ్యాలు అపారం. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంతవరకు ఎవరూ ఉపయోగించుకోని, దాదాపు లక్ష కోట్ల డాలర్ల విలువ చేసే ఖనిజ నిల్వలు చైనాకు అందుబాటులోకి వచ్చాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
ఇక, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన చైనాకు అటు అవకాశాలతోబాటు చిక్కులను కూడా తెచ్చిపెడుతోంది. అన్నిటికన్నా ఈ ప్రాంత భద్రత చైనాకు ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. షింజియాంగ్ ప్రాంతం సురక్షితంగా ఉండాలని, పాకిస్తాన్‌లో పెట్టిన 6,200 కోట్ల డాలర్లు విలువ చేసే పెట్టుబడులకు తీవ్రవాద దాడుల నుండి రక్షణ ఉండాలని చైనా కోరుకుంటోంది.
ఈ ఏడాది జులైలో, ఉత్తర పాకిస్తాన్‌లో దసు జల విద్యుత్ డ్యామ్‌పై పని చేసే తొమ్మిది మంది చైనా ఇంజనీర్లు ప్రయాణించే బస్సును ఉగ్రవాదులు పేల్చివేశారు. అంతకుముందు ఏప్రిల్‌లో, పాకిస్తానీ తాలిబన్లు చైనా రాయబారి వుంటున్న హోటల్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. దసు దాడులకు ఆఫ్ఘన్ తాలిబన్లను చైనా నిందించలేదు. ఆఫ్ఘన్ తాలిబన్లకు, పాకిస్తానీ తాలిబన్లకు మధ్య తేడాను చైనా స్పష్టంగా పాటిస్తోంది. పాకిస్తానీ తాలిబన్‌ను తీవ్రవాద సంస్థగాను...ఆఫ్ఘన్ తాలిబన్‌ను కీలకమైన సైనిక, రాజకీయ శక్తిగాను చైనా భావిస్తున్నది. దసు దాడులకు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టిటిపి)యే కారణమని చైనా విమర్శించింది. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సిపిఇసి) సురక్షితంగా వుండాలని చైనా కోరుకుంటున్నది.
భద్రతా పరమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్‌ఐ) ప్రణాళికలో ఆఫ్ఘనిస్తాన్ అత్యంత కీలకమైన రవాణా సంబంధాలను కలిగివున్నందున ఆఫ్ఘనిస్తాన్‌తో తమ ఆర్థిక సంబంధాలను మెరుగుపరచుకోవాలని చైనా ఆశిస్తున్నది. చైనాతో ఆఫ్ఘనిస్తాన్ అనుసంధానానికి సంబంధించి 50లక్షల అమెరికన్ డాలర్ల వ్యయంతో వాఖన్ కారిడార్ ప్రాజెక్టు ఇప్పటికే చేపట్టింది. బిఆర్‌ఐలో భాగంగా అంతకుముందు నిర్ణయించిన పలు ప్రాజెక్టులు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు, చైనా ప్రభుత్వ రంగ సంస్థ ఎంసిసి, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మధ్య రాగి గనుల తవ్వకాల కాంట్రాక్ట్ పలు భద్రతాపరమైన సమస్యల మూలంగా ఆగిపోయింది.
ఎన్ని అడ్డంకులు, ఈ ప్రాంతంపై అమెరికా నీడ వున్నప్పటికీ చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌ను ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించడంపై చైనా ఆసక్తిగా ఉన్నది. తిరిగి పెట్టుబడులు పెట్టడం ఆరంభించడానికి ముందు సురక్షితమైన, భద్రమైన వాణిజ్య వాతావరణం నెలకొనేలా చూడాలని చైనా కోరుకుంటున్నది. 2015 నుండి దాదాపు 97శాతం ఆఫ్ఘన్ వస్తువులు ఎలాంటి సుంకాలు లేకుండా చైనాకు ఎగుమతి అవుతున్నాయి.
ద్వంద్వ పన్నుల నివారణ (డిటిఎ) ఒప్పందంపై కొత్త తాలిబాన్ ప్రభుత్వం చైనాతో త్వరలో ఒక ఒప్పందంపై సంతకం చేయవచ్చని భావిస్తున్నారు. 2017 నుంచి స్తబ్దుగా ఉన్న చైనా-ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల జాయింట్ కమిటీ(జెసిఇటి)ని తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు.
కొన్ని ఆఫ్ఘన్ వస్తువులను చైనాకు ఎలాంటి సుంకాలు లేకుండా ఎగుమతి చేసేందుకు వీలు కల్పించే ఒప్పందాలపై 2014 ఆగస్టులో చైనా, ఆఫ్ఘనిస్తాన్‌లు సంతకాలు చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే వస్తువుల్లో 97 శాతం ఎలాంటి సుంకాలు లేకుండా చైనాకు ఎగుమతి అవుతున్నాయి.
ఆఫ్ఘన్‌లోని కొత్త ప్రభుత్వం, చైనా రెండూ ఇరు దేశాల మధ్య శాంతి, సుస్థిరతలను, వాణిజ్య సంబంధాల మెరుగుదలను కోరుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య సుస్థిరత, శాంతి, వాణిజ్య బంధం విరాజిల్లేందుకు అమెరికా అనుమతిస్తుందా అన్నదే ప్రశ్న. మానవ హక్కుల పట్ల ఆఫ్ఘన్, చైనాలకు నిబద్ధత లేదని అమెరికా ఇప్పటికే ప్రచారం అందుకుంది. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బ తీసేందుకు అమెరికా సైనిక మార్గాలను ఉపయోగించే పరిస్థితి లేదు. కానీ చైనాకు మరీ దగ్గర కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌ను నియంత్రించేందుకు ఆర్థిక ఆంక్షలను ఒక సాధనంగా ఉపయోగించే అవకాశాలైతే ఉన్నాయని కచ్చితంగా చెప్పవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో, పశ్చిమాసియాలో తీవ్రవాద శక్తులను ఎదుర్కొనగలిగిన గతానుభవం అమెరికాకు వున్నందున, ఒకపక్క తాలిబాన్లు సమీకృతులు కావడానికి అనుమతిస్తూ, మరోపక్క వివిధ ఆఫ్ఘన్ గ్రూపుల మధ్య అంతర్గత తగాదాలను రెచ్చగొట్టే యత్నాలు చేస్తోంది. షింజియాంగ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమయ్యేలా పరోక్ష ఘర్షణలను అమెరికా రెచ్చగొట్టవచ్చని చైనా ఆందోళన చెందుతోంది.
మొత్తంమీద, స్వతంత్ర ఆఫ్ఘనిస్తాన్ మరో సిరియాగా ఎక్కడ మారుతుందోనని యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. తమ సైనిక సామర్ధ్యాన్ని రుజువు చేసుకోవడానికి, తమ వ్యూహాత్మక లక్ష్యాలను సాధించేందుకు సిరియాలో వివిధ జాతుల మధ్య ఎలా తగాదాలు పెట్టిందీ చూశాము. ఆఫ్ఘనిస్తాన్ లోనూ వీటిని పునరావృతం చేయాలని అవి చూస్తున్నాయి.
బి.అర్జున్










