పాక్ వ్యతిరేక, చైనా వ్యతిరేక వైఖరితో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం మన దక్షిణాసియా దేశాలన్నింటి నుండి ఏకాకిని చేసింది. తన విదేశాంగ విధానాన్ని, వ్యూహాత్మక దృక్పథాన్ని తిరిగి సమీక్షించుకోకపోతే మోడీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత ఘర్షణాయుతమైన ప్రాంతీయ వాతావరణాన్ని ఎదుర్కొనాల్సి వుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న హిందూత్వ విధానాల ఫలితంగా దక్షిణాసియాలో పెరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదం ముప్పు ఇది.
ఆఫ్ఘనిస్తాన్ నుండి అవమానకరమైన రీతిలో అమెరికా వైదొలగడం, ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ కుప్పకూలడం, అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోవడం, తాలిబన్లు చాలా వేగంగా దేశాన్ని స్వాధీనం చేసుకోవడం...అన్నీ దిగ్భ్రాంతికర పరిణామాలే. అమెరికా నేతృత్వంలోని నాటో మిత్రపక్షాలు ఆఫ్ఘనిస్తాన్‌పై దండెత్తి, తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసిన 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్లీ తాలిబన్లు అధికారం లోకి వచ్చారు. ఈ రెండు దశాబ్దాల్లోనూ అమెరికా 2 లక్షల కోట్ల డాలర్లుకు పైగా ఖర్చు పెట్టింది. ఆక్రమణ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో 1,30,000 నాటో బలగాలు వున్నాయి. నేషనల్ ఆర్మీని నిర్మించడానికి 8800 కోట్ల డాలర్లుకు పైగా ఖర్చు చేసింది. బ్రిటన్, ఇతర నాటో మిత్రపక్షాలు ఖర్చు చేసిన కోట్లాది డాలర్ల మొత్తాలు ఇందులో కలపలేదు.
గత 20 ఏళ్ళలో అమెరికా, పశ్చిమ దేశాలు ఎలా ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించాయన్నదే ప్రస్తుత కథనం. ఇందులో అమెరికా, మిత్రపక్షాల వైమానిక బాంబు దాడుల్లో వేలాదిమంది మరణించిన కథనాలు చేర్చలేదు. ఈ వైమానిక బాంబు దాడుల్లోనే 40 శాతం మంది పౌరులు మరణించారు. ఆష్రఫ్ ఘని ప్రభుత్వానికి విలువైన ప్రజా మద్దతు లేదు. పైగా అవినీతితో కునారిల్లుతోంది. ఈ లంచగొండితనం సైన్యాన్ని బాగా ప్రభావితం చేసింది. మీడియా కథనాలన్నిట్లో ఉద్దేశపూర్వకంగా ఇమిడివున్న అంశం ఇదే. 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత అధ్యక్షుడు బుష్ 'తీవ్రవాదంపై యుద్ధం' పేరుతో జరిపిన దాడులు సందేహాస్పదం. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలన, ఒసామా బిన్ లాడెన్ సృష్టి...అన్నీ కూడా 1980ల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ యూనియన్ బలగాలు వుండడానికి వ్యతిరేకంగా ముజాహిదీన్లు లేవనెత్తిన జిహాద్ ఉత్పత్తులేనని మరువరాదు. జిహాద్ కోసం ఒసామా బిన్ లాడెన్, వివిధ ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు ఒక్క చోటకు చేరడం...వీరికి సిఐఎ నిధులు అందించడం, పాకిస్తాన్ ఐఎస్‌ఐ ద్వారా శిక్షణ అందడం ఇవన్నీ కలిసి చివరకు అల్‌ఖైదాగా మారింది. తాలిబన్‌కి సంబంధించినంత వరకు వారు ఆఫ్ఘన్ ముజాహిదీన్ బలగాల వారసులే. ప్రధానంగా పష్తున్ జాతీయులు.
అధ్యక్షుడు బుష్, నయా ఉదారవాద భావాలు కలిగిన ఆయన సలహాదారులు ప్రారంభించిన ఈ తీవ్రవాదంపై పోరు, అత్యంత వేగంగా అమెరికా సామ్రాజ్యవాదం తన గుత్తాధిపత్య కార్యకలాపాలను చేపట్టే ఒక దురాక్రమణ సాధనంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత 2003 మార్చిలో అమెరికా తదుపరి లక్ష్యంగా ఇరాక్ వచ్చింది. అత్యంత కపటమైన దురాక్రమణ చర్యలో భాగంగా సద్దాం హుస్సేన్‌కు అల్‌ఖైదాతో సంబంధాలున్నాయని ఆరోపించారు. వాస్తవానికి, అప్పటికి లౌకిక ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు అతడిని నాస్తికుడిగా పేర్కొంటూ ఒసామా బిన్ లాడెన్ నిరసించారు. ఇక ఆ తర్వాత లిబియా, సిరియాలకు తీవ్రవాదంపై పోరు విస్తరించడంతో విధ్వంసం కొనసాగింది. ఎక్కడైతే సామ్రాజ్యవాద దురాక్రమణ జరుగుతోందో అక్కడ మరింత తీవ్రవాదం, తీవ్రవాద సంస్థలు పెచ్చరిల్లాయన్నది తిరుగులేని వాస్తవం. ఇరాక్, సిరియాల్లో, అల్‌ఖైదా, అంతకంటే అధ్వాన్నమైన ఇస్లామిక్ స్టేట్ తలెత్తాయి. లిబియా ధ్వంసమైన తర్వాత, వివిధ ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులు ఆవిర్భవించాయి. ఆ తర్వాత వారు తమ ప్రభావాన్ని వాయవ్య ఆఫ్రికాకు విస్తరించారు. సామ్రాజ్యవాద దురాక్రమణ, తీవ్రవాదం రెండూ పక్క పక్కనే సాగాయి.
తాలిబన్‌కు వున్న విప్లవ ప్రతీఘాత ఛాందసవాద స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇలా దేశాన్ని స్వాధీనపరుచుకున్న తీరు తీవ్రంగా ఆందోళన కలిగించే పరిణామం. తాలిబన్లు అధికారంలోకి రావడంతో ఆఫ్ఘనిస్తాన్ భవితవ్యం రూపురేఖలు అస్పష్టంగా, అనిశ్చితంగా మారిపోయాయి. జాతుల వైవిధ్యం, మహిళల హక్కులు, మైనారిటీల పట్ల వ్యవహార శైలి వంటి విషయాల్లో తాలిబన్ వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుందనే అంశంపైనే అంతా ఆధారపడి వుంది. గతంలోని తాలిబన్ ప్రభుత్వం ఈ మూడు అంశాల్లో దారుణమైన, ప్రగతిశీల నిరోధక వైఖరితో వుండేది. ఆగస్టు 16న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులను చర్చించింది. ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై ఇస్లామిక్ స్టేట్, అల్‌ఖైదా వంటి తీవ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించరాదంటూ లక్ష్మణ రేఖను గీయాలని సమావేశంలో ఒక ఉమ్మడి అవగాహన వచ్చింది. ఇది భారత్‌కు చాలా ఆందోళన కలిగించే అంశం. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకున్న సిరాజుద్దీన్ హక్కాని వర్గానికి అనుబంధ సంస్థగా తాలిబన్ వుంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా పరాజయం భారత్‌కు పలు గుణపాఠాలను నేర్పింది. 2001 ప్రారంభం నుండి అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా మిలటరీ దాడికి పూర్తిగా మద్దతు ప్రకటించింది. వాస్తవానికి, భారత్ కల్పించిన సదుపాయాలను అమెరికా ఉపయోగించుకోలేదని, అందుకు బదులుగా పాకిస్తాన్‌పై ఆధారపడిందని అసంతృప్తిని వ్యక్తం చేసింది కూడా. ఏళ్ళ తరబడి అమెరికాతో అంటకాగిన వైనంతో చిట్టచివరకు భారత్, అమెరికాకు వ్యూహాత్మక మిత్రపక్షంగా తయారైంది. మోడీ ప్రభుత్వం సంతకాలు చేసిన పలు సైనిక ఒప్పందాలు ఈ పొత్తుకు ఒక సైనిక స్వభావాన్ని ఇచ్చాయి. చతుష్ట కూటమి (క్వాడ్)పై సంతకాలు చేయడం తుది దశ. వ్యూహాత్మకమైన ఈ పొత్తు వల్ల భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని సమర్ధవంతంగా నిరోధించగలిగారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని దెబ్బ తీశారు. ప్రధానంగా పశ్చిమాసియాలో తన గుత్తాధిపత్యాన్ని బలోపేతం చేసేందుకే అమెరికా తీవ్రవాదంపై యుద్ధం చేపట్టినట్లైతే...చైనాను నియంత్రించి, ఒంటరిని చేయడానికి అనుసరించిన వ్యూహమే క్వాడ్ ఏర్పాటు. గత వారంలో, విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ, తూర్పున అమెరికాతో పొత్తు వుందని, కానీ పశ్చిమాన ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో విభేదాలు వున్నాయని అన్నారు. అంటే, క్వాడ్‌కు కట్టుబడాలని ప్రభుత్వం భావిస్తోంది కానీ ఆఫ్ఘనిస్తాన్‌ను అలా మధ్య లోనే అమెరికా వదిలివేసి వెళ్ళడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అమెరికాతో పొత్తుకే ప్రాధాన్యమివ్వడం వల్ల ఈ ప్రాంతంలో భారత్ ఏకాకిగా మారింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ విధానంలో స్పష్టమైంది. 1996, 2001 మధ్య తాలిబన్లు అధికారంలో వున్నపుడు భారత్‌తో పాటు నాటోకు మద్దతిచ్చిన రష్యా, ఇరాన్‌లు ఇప్పుడు తాలిబన్‌తో సంబంధాలను పెట్టుకోవడం ఇక్కడ విశేషం. చైనాతో కలిసి వారు ఇప్పటికే, ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముందుగానే తాలిబన్లతో చర్చలు జరిపారు. పాక్ వ్యతిరేక, చైనా వ్యతిరేక వైఖరితో మోడీ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం మన దక్షిణాసియా దేశాలన్నింటి నుండి ఏకాకిని చేసింది. తన విదేశాంగ విధానాన్ని, వ్యూహాత్మక దృక్పథాన్ని తిరిగి సమీక్షించుకోకపోతే మోడీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత ఘర్షణాయుతమైన ప్రాంతీయ వాతావరణాన్ని ఎదుర్కొనాల్సి వుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న హిందూత్వ విధానాల ఫలితంగా దక్షిణాసియాలో పెరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదం ముప్పు ఇది. ఈ విధానాలతో మన దేశం ఇటువంటి ప్రభావాలకు మరింతగా గురవుతుంది. మైనారిటీలను వేధించడం ఇటువంటి వాటికి అవసరమైన ప్రాతిపదికను సృష్టిస్తుంది. నిర్దిష్టంగా లౌకికవాద విధానాలను అనుసరించడం వల్లనే ఈ ధోరణిని అడ్డుకోగలం.
భారత్‌తో సన్నిహితమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కలిగిన ఆఫ్ఘన్ ప్రజలు అత్యవసరంగా ఎదుర్కొనే ఆందోళనలను కొన్నింటినైనా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సి వుంది. శరణార్ధులుగా ఇక్కడకు రావాలను కుంటున్న వారి రాకకు భారత్ చర్యలు తీసుకోవాల్సి వుంది. దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న వందలాది మంది ఆఫ్ఘన్ విద్యార్థులకు సంబంధించి వారి వీసాలను పునరుద్ధరించడమో లేదా పొడిగించడమో చేయాల్సిన అవసరం వుంది. స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్ల ద్వారా అవసరం వున్న వారికి ఆర్థిక సాయం అందచేయాల్సి వుంది. ఆఫ్ఘన్ల ప్రయోజాలు, వారి సంక్షేమమే ఆఫ్ఘనిస్తాన్‌పై మన కొత్త విధానంలో కీలకాంశంగా వుండాలి. అంతేకాని భౌగోళిక రాజకీయాధికారం ఇక్కడ పాత్ర పోషించరాదు.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం /










