ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసి అకారణంగా తొలగింపబడ్డ ఆప్కోస్ ఉద్యోగుల నిరవధిక నిరసనలు శుక్రవారం 788వ రోజు కొనసాగాయి. విధుల నుండి తొలగింపబడి గత రెండు సంవత్సరాల ఏభై ఐదు రోజులు కావస్తున్న స్పందించని ప్రభుత్వ తీరుపై ఆక్రోశం వెళ్లగక్కారు. ప్రభుత్వ తీరుపై కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నా, ఉద్యోగాలు చేసుకోవాలనుకున్న తమను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎటువంటి ముందస్తు కారణాలు చూపకుండా పనిచేస్తున్న 65 మంది ఆప్కాస్ ఉద్యోగులను తొలగించిన తీరు చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుందని ధనుంజయ రావు, దయానంద ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టి 788వ రోజుకి చేరుకుందన్నారు. వేసిన శిబిరం శిధిలావస్థకు చేరినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదన్నారు. ప్రాణాలు తెగించి కోవిడ్ మొదటి రెండవ దశలో పనిచేశామని అన్నారు. నిత్యం దీక్షాశిబిరం ముందు నుంచే వెళ్ళే మంత్రులు, రాజకీయ నాయకులు, జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ వెళుతున్న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్యాధికారులు తక్షణం స్పందించి తమ ఆకలి కేకలు విని తమకు ఉద్యోగాలు ఇప్పించి ప్రాణాలు కాపాడాలని, కుటుంబాలు నిలబెట్టాలని వేడుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యదర్శి సిహెచ్ ఏడుకొండలు, రమణ, శివ, రాంబాబు సభ్యులు పాల్గొన్నారు.