నెలరాజులా
వెలుగులు చిందుతూ
ముద్దబంతిలా
మురిపాలొలకబోస్తూ
బతుకు పోరాటదారుల్లో
నీడనిచ్చి సేదతీర్చు వృక్షం
స్నేహబంధం
మదిలో నిత్యం పారే
వెలుగు ఉదయాల సెలయేరై
చూపుమాత్రంతోనే
ఎడారై ఎండిన ఎదలో
సుధలూరించేదై
కష్టం ఇష్టమయ్యే
భావసారూప్యత కలిగి
ఆదుకునే ఆపన్నహస్తం
కష్టంలో కాచుకునే దైవమది
ఎక్కువ తక్కువల భేదం
తెలియక
అంధకార బతుకున
వెలుగుకిరణం
శూన్యమైన జీవితాన
విరిసే నవ్వుల వానే
చెలిమంటే
నిన్నటి నైరాశ్యాల నింగిలో
రేపటి ఆశయై పొద్దుపొడుస్తూ
ఒంటరితనాల ఎదల్లో
తోడుగా నేనున్నానంటూ
స్థైర్యాన్నిచ్చేదై
సంతోషాల నక్షత్రాలను
పోగేసేందుకు
ఆనందాల సంచై
వెంట వచ్చేదే స్నేహం
అదొక
నిజమైన స్వప్నం
అద్భుతమైన అనుభూతి
అందమైన ప్రపంచం
వేమూరి శ్రీనివాస్
99121 28967