Sep 29,2022 23:07

కిమ్స్‌ ఐకాన్‌ ఆధ్వర్యాన 3కె వాక్‌

ప్రజాశక్తి- గాజువాక: మారుతున్న జీవనశైలి, ఆహరపు అలవాట్లు కారణంగానే చిన్నవయస్సులోనూ హృద్రోగ సమస్యలు వస్తున్నాయని, అప్రమత్తతతో తగు జాగ్రత్తలు తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కిమ్స్‌ ఐకాన్‌ ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపాలరాజు, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ జి.సుఖేష్‌రెడ్డి అన్నారు. గురువారం వరల్డ్‌ హార్ట్‌డే సందర్భంగా కిమ్స్‌ ఐకాన్‌ ఆధ్వర్యంలో గాజువాక సెంటర్‌ నుంచి విశాఖ డెయిరీ వరకు 3కె వాక్‌ నిర్వహించారు. గాజువాక ఎడిసిపి గంగాధరం, ట్రాఫిక్‌ ఎసిపి ఎస్‌.రాజ్‌కుమార్‌, సిఐలు సత్యనారాయణరెడ్డి, ఎల్‌.భాస్కర్‌ పాల్గొని 3కె వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గోపాలరాజు, సుఖేష్‌రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యానికి నిత్య వ్యాయామం అవసరమే అయినా, మోతాదుకు మించి జిమ్‌లో ఎక్సరసైజ్‌లు చేయడం అనర్థమేనన్నారు. ఉదయాన లేచిన వెంటనే వాకింగ్‌ చేయడం ఆరోగ్యానికి మంచిదన్నారు. ప్రతి ఆరునెలలకోసారి గుండెను పరీక్షించుకోవడం మంచిదన్నారు. కార్యక్రమంలో కిమ్స్‌ హాస్పిటల్‌ కార్డియాలజిస్ట్‌లు డాక్టర్‌. గౌరీశంకర్‌ రెడ్డి, డాక్టర్‌. కె.నారాయణరాజు, డాక్టర్‌. సాయిమణి కందన్‌, డాక్టర్‌. శాంతి ప్రియ, డాక్టర్‌ వాసుబాబు దావాల, డాక్టర్‌. రవీంద్ర దేవ్‌, హాస్పిటల్‌ సిబ్బంది పాల్గొన్నారు.