కరోనా వైరస్‌లో కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడకుండా తప్పించుకోవాలంటే అన్ని విధాల అప్రమత్తంగా ఉండటమే మార్గంగా కనిపిస్తోంది. దీనిలోని మ్యుటేషన్లపై పరిశోధనలు జరుగుతుండగానే కొత్త వేరియంట్ అనేక దేశాలకు వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లు.హెచ్.ఓ) వెల్లడించిన సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రానికి 57 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించింది. దీంతో అనేక దేశాలు మళ్లీ రక్షణ ఛత్రంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ అసాధారణ వ్యాప్తి పట్ల ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యు.హెచ్.ఓ వ్యాప్తి తీరు ఇదే మాదిరి కొనసాగితే ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, ఇన్‌పేషంట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తాజాగా హెచ్చరిక చేసింది. డెల్టా వేరియంట్ కంటే వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, అసాధారణంగా వ్యాపిస్తున్న తీరు ఎక్కువ మందిని ఆస్పత్రుల పాలు చేసే అవకాశం ఉందని చెబుతూనే వ్యాధి తీవ్రత స్థాయిని ఇంకా అధికారికంగా నిర్ధారించని విషయాన్ని డబ్ల్యు.హెచ్.ఓ గుర్తుచేసింది. అధికంగా ఉన్న మ్యుటేషన్లు రోగనిరోధక శక్తిని ఏమేరకు దెబ్బ తీస్తాయన్న దానిమీదా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. ఐరోపా దేశాల్లో రానున్న వారాల్లో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని యూరోపియన్ హెల్త్ ఏజెన్సీ బుధవారం నాడే మరో హెచ్చరిక జారీ చేసింది. కోవిడ్ వ్యాప్తి కొనసాగుతుండటం, వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటంతో పాటు ఒమిక్రాన్ వ్యాపిస్తున్న తీరు ఈ పరిస్థితికి కారణం కావచ్చని ఆ ఏజెన్సీ అంచనా వేసింది. అలసత్వం, నిర్లక్ష్యం ఏమాత్రం కూడదన్నదే ఈ రెండు నివేదికల సారాంశం!
మన దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం అర్హులైన వారిలో 50 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేశారు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, సినీ తారలు అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యా రారు తదితరులు బీహార్‌లో వ్యాక్సిన్ పొందినట్లు రికార్డులు చూపుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. ఒక్క బీహారే కాదు, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ లెక్కలు ఇలాగే ఉన్నాయంటూ వస్తున్న వార్తలు మొత్తం వ్యాక్సినేషన్ లెక్కల విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. 18 ఏళ్ల లోపు వారికి ఇంకా టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించకపోవడం, అర్హులలో ఇంకా 50 శాతం మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండటం మన ప్రజానీకానికి వ్యాక్సిన్ భరోసా ఇంకా లభించలేదనడానికి నిదర్శనం. ఈ సమయంలోనే ప్రభుత్వం నుండి తగినంతగా ఆర్డర్లు రాకపోవడంతో రానున్న కొద్ది రోజుల్లో ఉత్పత్తిని తగ్గించడానికి కోవిషీల్డ్ సిద్ధమౌతోందంటూ వస్తున్న వార్తలు ఆందోళనకరం. నిజానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా, త్వరితంగా చేపట్టాల్సిన సమయమిది! ఆ దిశలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో చూడాలి. దేశంలో సాధారణ కోవిడ్ కేసుల ఉధృతి గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ, పూర్తిగా నివారించినట్లు కాదు. మంగళవారం నాడు కొత్తగా 8,439 మందికి కోవిడ్ సోకింది! దేశ వ్యాప్తంగా 93,733 యాక్టివ్ కేసులు వున్నాయి. 21 మందికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకింది. వివిధ దేశాల నుండి విమానాశ్రాయాలకు వచ్చిన వందలాది మందికి చేసిన పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి వుంది.
రాష్ట్రానికి గడిచిన వారం రోజుల్లో 9,400 మంది రాగా, ఒక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణైందని అధికారులు చెబుతున్నారు. అది కూడా ఒమిక్రానో, కాదో నిర్ధారణ కావాల్సి ఉంది. ఇది ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, నిర్లక్ష్యంగా ఉండటం మొదటికే మోసం తెస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం 50 శాతం మందికి పైగా ఇప్పటికే మాస్కులు పెట్టుకోవడం మానేసి రోడ్లపైకి వస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం వంటి కనీస జాగ్రత్తలను ప్రజానీకం తప్పనిసరిగా పాటించాలి. కొత్త వేరియంట్ లక్షణాలు స్పష్టమై, నివారణ విధానాలు తేలేంత వరకూ పూర్తి స్థాయి అప్రమత్తతే వైరస్ పై పోరాటానికి ఆయుధం! దీనిని విస్తృతంగా ప్రచారం చేసి, ఆ దిశలో చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.










