దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం శుభ పరిణామం. సంఖ్య లోనూ, తీవ్రతలోనూ గణనీయమైన రీతిలో తగ్గుముఖం పట్టింది. అయితే కొత్తగా నమోదౌతున్న కేసులు ఇంకా జాగ్రత్త అవసరమైన రీతిలోనే ఉంటున్నాయి. ఇప్పుడు దేశంలో వెలుగుచూస్తున్న కేసుల్లో డెబ్భై శాతం వరకూ మహారాష్ట్ర, కేరళ. ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్రలో అధికంగా నమోదౌతున్నాయి. దశల వారీగా జనజీవితం సాధారణ స్థితికి రావడం,ఈ మధ్యనే ఎన్నికలు జరగడం, లోకల్ రైళ్లు మళ్ళీ తిరుగుతుండడాన్ని కారణంగా భావిస్తున్నా అసలు కారణం మాత్రం ప్రజల్లో కరోనా నియంత్రణ పట్ల ఉదాసీనత కలగడం. మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటివాటిని తేలిగ్గా తీసుకోవడం. అందుకనే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సామూహిక, సామాజిక కార్యక్రమాలపై మళ్ళీ కొన్ని ఆంక్షలు పెట్టింది. అవసరమైతే లాక్డౌన్ పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. ముంబైలో ధారవి వంటి అతి జనసమ్మర్థ ప్రాంతంలోనే కరోనా వ్యాప్తిని కట్టడి చెయ్యడం వీలు పడిందంటే అది కరోనా నియంత్రణ పద్ధతుల్ని పక్కాగా అమలుచెయ్యడం ద్వారానే. ఆ స్థాయి సీరియస్నెస్ అటు ప్రభుత్వంలోనూ, ఇటు ప్రజల్లోనూ ఉండాలి. అందరూ క్రమశిక్షణాయుత ప్రవర్తనకు కట్టుబడాలి. లేదంటే ముప్పు అందరికీ. తాజాగా దేశంలో యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ వెరైటీ కరోనా కేసులు బయటపడ్డాయి. ఇవన్నీ మ్యుటేషన్ పొందిన వైరస్లు. అవి ఎంత ప్రమాదకరమైనవో, ఏ స్థాయిలో వ్యాప్తి చెందగలవో, వాటిపై టీకా ప్రభావం ఎంతవరకూ ఉంటుందో ఇంకా స్పష్టత లేదు. కనుక పాత రూపంలోని కరోనా బలహీనమైనదని, నశించిపోతుందని, టీకా వచ్చిందని ధీమా పనికిరాదు. దేశ జనాభాలో 21 శాతం మంది కరోనా ప్రభావితం అయ్యారని ఒక అంచనా. సదరు వైరస్ పూర్తిగా బలహీనపడాలంటే-అంటే హెర్డ్ ఇమ్మ్యూనిటి రావాలంటే ఆ సంఖ్య నలభై శాతం దాటాలి. అది చాలా దూరం. కాబట్టి అందరూ మాస్కు వినియోగం,భౌతిక దూరం, ముఖం, చేతులు శుభ్రత తరహా కరోనా నియంత్రణ పద్ధతుల్ని విధిగా పాటించాలి. సమూహంలో ఉన్నప్పుడు అలసత్వం వహించరాదు. సమైక్యంగానే కరోనాపై యుద్ధం చెయ్యాలి. అప్పుడే విజయం సాధ్యం.
* డా|| డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ, పార్వతీపురం.










