* జిల్లా అవసరాలకు తగ్గట్టుగా పంపిణీ కాని విద్యుత్
* భారీ పరిశ్రమలకు కొద్ది గంటలపాటు నిలిపివేత
* పల్లెలకూ తప్పని కోతలు
ఇబ్బందులు పడుతున్న జనం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: ఇంధన సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో వాతలు పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు కరెంట్ సరిగా సరఫరా చేయకుండా వాతలు పెడుతోంది. జిల్లా అవసరాలకు మేర విద్యుత్ పంపిణీ జరగకపోవడంతో అనివార్యంగా కోతలు విధించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ఎసిల వినియోగం ఎక్కువగా ఉండడంతో కరెంట్ వాడకం పెరుగుతోంది. డిమాండ్‌కు తగినంత విద్యుత్ సరఫరా లేని సమయంలో వినియోగం పెరిగిపోవడంతో గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా భారీ పరిశ్రమలకు కొద్ది గంటలపాటు సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి పల్లెలకు గంటల తరబడి విద్యుత్ సరఫరా జరగడం లేదు. కొన్నిచోట్ల పట్టణాలకూ కోత తప్పడం లేదు. కరెంట్ ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు ఇస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో మొత్తం 9,23,416 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కేటగిరి-1 పరిధిలోని గృహ వినియోగ కనెక్షన్లు 7,89,151 ఉన్నాయి. కేటగిరి-2 కింద వాణిజ్య అవసరాలకు 76,476 మంది విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. కేటగిరి-3లో 3,067 పరిశ్రమలు కరెంట్‌ను వాడుతున్నారు. కేటగిరి-4 పరిధిలోకి వచ్చే వీధిదీపాలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించి 22,154 కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు సుమారు 24 వేలు కనెక్షన్లు ఉన్నాయి. కరెంట్ వాడకాన్ని బట్టి ఎల్‌టి (లో టెన్షన్), హెచ్‌టి (హై టెన్షన్) కేటగిరీలుగా విభజించారు. విద్యుత్ వినియోగం 75 కిలో యూనిట్లు లోపు ఉన్న సర్వీసులను ఎల్‌టి కనెక్షన్లుగా, 75 కిలోవాట్లు దాటితే హై టెన్షన్ కనెక్షన్లుగా పరిగణిస్తారు. జిల్లాలో మొత్తం 8,72,033 ఎల్‌టి కనెక్షన్లు ఉండగా, 58.46 కోట్ల యూనిట్ల కరెంట్‌ను వినియోగిస్తున్నారు. 494 హెచ్‌టి కనెక్షన్లు ఉండగా 5.25 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు.
జిల్లా కోటాపై కోత
గత వారం రోజులుగా జిల్లా అవసరాలకు కావాల్సిన విద్యుత్, పంపిణీ అయిన కరెంట్ పరిశీలిస్తే, విద్యుత్ కోతలకు దారితీసిన పరిస్థితులు తేటతెల్లమవుతాయి. ఈనెల 13న తేదీన 5.38 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరం కాగా 5.44 మిలియన్ యూనిట్లే సరఫరా అయింది. 14న 5.40 మిలియన్ యూనిట్లు వాడితే 5.28 మిలియన్ యూనిట్లు పంపిణీ అయింది. 15న 5.25 యూనిట్లు ఉపయోగిస్తే జిల్లాకు 5.29 మిలియన్ యూనిట్ల కోటా వచ్చింది. 16న 5.42 మిలియన్ యూనిట్లకు గానూ 5.33 మిలియన్ యూనిట్ల జిల్లాకు పంపిణీ అయింది. 17న 5.12 మిలియన్ యూనిట్లకు గానూ 5.19 మిలియన్ యూనిట్లు, 18న 4.63 మిలియన్ యూనిట్లకు గానూ 5.32 మిలియన్ యూనిట్లు పంపిణీ అయింది. 19న 5.04 మిలియన్ యూనిట్లు ఉపయోగించగా, ఆ రోజున 5.25 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది. 20న 5.03 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను వినియోగించగా 5.07 మిలియన్ యూనిట్లు జిల్లాకు పంపిణీ అయింది. దీంతో గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయం తదితర అన్నిరంగాలకు అందిస్తున్న విద్యుత్ సరఫరలో కోత విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
కరెంట్ కోతతో ఇబ్బందులు
ఎండలు ఎక్కువగా ఉండడం, ఉక్కపోతతో ఎసిల వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. వర్షాలు పడిన సందర్భంలో డిమాండ్ కాస్త తగ్గుతోంది. విద్యుత్ పంపిణీ తగ్గడం, అవసరాలు పెరగడంతో లోటును తగ్గించుకోవడానికి పరిశ్రమలకు, పల్లెలకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. పగలంతా పనులకు వెళ్లి రాత్రిళ్లు కునుకు తీద్దామంటే ఉక్కపోత, దోమల బెడదతో అవస్థలు పడుతున్నారు.
ఫ్రీక్వెన్సీ బట్టి సరఫరాలో మార్పులు
గ్రిడ్‌ల నుంచి వచ్చే విద్యుత్‌లో ఫ్రీక్వెన్సీ బట్టి సరఫరాలో మార్పులు చేస్తున్నాం. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా కావడం లేదు. జిల్లాలో భారీ పరిశ్రమల వరకు కొద్ది సమయం కరెంట్ ఆపుతున్నాం. విద్యుత్ కోతలు మాత్రం విధించడం లేదు.
- ఎల్.దైవప్రసాద్, ఎపిఇపిడిసిఎల్ ఎస్‌ఇ










