Apr 06,2021 07:13

   రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించడంతో పోటీ ప్రారంభంకాక మునుపే చేతులెత్తేసినట్లయింది. రాష్ట్రంలో కాలూనుకోలేక నానా తంటాలూ పడుతూ విద్వేష రాజకీయాలతో వాతావరణాన్ని కలుషితం చేయజూస్తున్న బిజెపి కి ఈ బారుకాట్‌ నిర్ణయం అనుకోని అవకాశం కల్పిస్తోంది. తమ పార్టీకి ఓటు వేసుకోవాలనుకునే తమ శ్రేణుల ఆకాంక్షను, స్ఫూర్తిని పార్టీ నాయకత్వమే దెబ్బతీసినట్లయింది. ఎన్నికల బహిష్కరణకు టిడిపి చెబుతున్న కారణాలు...అధికార వైసిపి దౌర్జన్యాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, బలవంతపు ఏకగ్రీవాలు వగైరా వగైరా. కొత్త ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఇసి) పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోకుండా రాత్రికిరాత్రి ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. ఆదరాబాదరగా షెడ్యూల్‌ విడుదలను టిడిపి నే కాదు అన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. నాటి దౌర్జన్యాలు, బెదిరింపులు, బలవంతపు ఏకగ్రీవాలపైనా నిరసన తెలిపాయి. అలాంటి చోట్ల మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్‌ చేశాయి. ఎస్‌ఇసి పెడచెవిన పెట్టారు. ఆ కారణంతో ఎన్నికల మధ్యలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తప్పుకోవడమంటే అధికారపార్టీ దాష్టీకాలపై పోట్లాడకుండా చేతులెత్తేయడమే. యుద్ధం మధ్యలో ఎదిరించి పోరాడాలని కేడర్‌కు దిశా నిర్దేశం చేసే బదులు నాయకత్వం అస్త్ర సన్యాసం చేయడం నిస్సహాయతను నూరి పోయడమే. అధిష్టానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేని శ్రేణులు చాలా చోట్ల పోటీలో నిలిచారు. అధికార పార్టీ దుర్నీతిని, అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికి ఈ ఎన్నికలు ఒక అవకాశం. ఆ అవకాశాన్ని టిడిపి జారవిడుచుకోవడం బట్టి అధినేతకు ప్రజల పట్ల విశ్వాసం బాగా సన్నగిల్లిందని అనుకోవాలి.
   టిడిపి ఎన్నికల బహిష్కరణపై అధికార వైసిపి సంబరపడటం, ఇక అన్ని సీట్లూ తమవేనని చంకలు గుద్దుకోవడం ప్రజాస్వామ్యానికి అరిష్టం. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం పాత్ర ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పాత్ర కూడా అంతే ముఖ్యం. పోటీ లేకుండా అధికారపక్షం అన్ని సీట్లు కైవసం చేసుకోవడం ఎంత మాత్రం నైతిక విజయం అనిపించుకోదు. ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం ఉన్న వారెవరైనా ఎన్నికలను బారుకాట్‌ చేసిన వారిని ఎన్నికల్లో పాల్గొనేలా కృషి చేయాలి. కానీ ప్రభుత్వంలో ఉన్న వైసిపి ఆ పని చేయకపోగా జెండా పీకేశారని, పారిపోయారని గేలి చేయడం తగనిపని. గతంలో టిడిపి అధికారంలో ఉండగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి ఇలాగే ప్రతిపక్షం పారిపోయిందని విమర్శించింది తప్ప అసెంబ్లీకి రప్పించేందుకు ప్రయత్నించలేదు. ఇప్పుడు ప్రతిపక్షానికి మారిన టిడిపి ఏకంగా ఎన్నికలను బహిష్కరించగా, ప్రభుత్వంలో ఉన్న వైసిపి మక్కీకిమక్కి ప్రతిపక్షం భయపడి ఉడాయించిందని ఆరోపిస్తోంది. దీన్నిబట్టి సదరు రెండు పార్టీలకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదని, అధికార ఆధిపత్యమే పరమావధి అని అర్థమవుతుంది.
   రాష్ట్రంలో ఏ గడ్డి కరచైనా ఉనికిని చాటాలని కాచుక్కూర్చున్న బిజెపి కి, టిడిపి ఎన్నికల బహిష్కరణ నిర్ణయం అవకాశం ఇచ్చినట్లయింది. అన్ని విధాలా ఎ.పి కి ద్రోహం చేసిన బిజెపి, ప్రశాంత రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు పాచికలు వేస్తోంది. తక్కువ సీట్లలోనే బిజెపి నామినేషన్లు వేసినప్పటికీ, టిడిపి పోటీలో లేకపోతే కొన్ని చోట్లయినా నెగ్గి బలం పెంచుకోవాలని చూస్తోంది. ఈ పరిణామం రాష్ట్రానికి, ప్రజల ఐక్యతకు ప్రమాదకరం. ఈ విషయంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు అప్రమత్తం కావాలి. వైసిపి, టిడిపి చాటుమాటున బిజెపి విధానాల పట్ల అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయి. జనసేన ఆ పార్టీతో నేరుగా అంటకాగింది. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా తమ బలం మేరకు శక్తి వంచన లేకుండా నికరంగా పోరాడుతున్నది వామపక్షాలే. ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని కాపాడుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ లౌకిక, ప్రజాస్వామ్య పరిరక్షకులకు మద్దతు పలకాలి.