* ఎంపీ రామ్మోహన్ నాయుడు
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం: రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా అప్రజాస్వామిక పద్ధతిలో పరిపాలన చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం వచ్చిందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మండలంలోని మందపల్లి పంచాయతీలో అనిల్ సాహు నేతృత్వంలో వైసిపికి చెందిన నాయకులు ఎమ్మెల్యే బెందాళం అశోక్ సమక్షంలో ఆదివారం టిడిపిలోకి చేరారు. వీరికి ఎంపీ టిడిపి కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో ఆంక్షలు పెట్టి అనేక మంది ప్రజలకు పథకాలు అందించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రెండు బలమైన పార్టీలు టిడిపి, జనసేన కలసి పోటీ చేయాలన్న ఆలోచన ప్రజల నుంచి వచ్చిందేనని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద నుంచి జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ ప్రకటించిన పొత్తు జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. అప్పటి నుంచి సిఎం జగన్ ఎలగైనా పొత్తును విడదీయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే సత్తా లేదని జగన్... ప్రతి సమావేశంలోనూ చంద్రబాబునాయుడు విమర్శించడానికి తప్ప... మరో మాట లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ పథకాల్లో కోతలు విధిస్తు మోసం చేస్తున్నారని విమర్శించారు. చేయూత కేవలం 45 నుంచి 60లోపు వరకే పరిమితం చేయడం దారుణమన్నారు. అంతకుముందు బాలకృష్ణాపురంలో ఎంపీ నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు దక్కత ఢిల్లీరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాసరి రాజు, దాసుబాబు, సహదేవ్‌రెడ్డి, చంద్రశేఖర్, మణిచంద్ర, ప్రకాష్, సీపాన వెంకటరమణ, లోహిదాస్, కాళ్ల గోపి, కామేశ్వరరావు, కాళ్ల జయదేవ్, పద్మనాభం, జాని, కొండ శంకరరెడ్డి పాల్గొన్నారు.