* అర్జీలు రీ ఓపెన్ కారాదు
* సర్వే, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ్ జైన్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్, జలుమూరు : జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే వినతుల్లో అపరిష్కృత అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించాలని సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్థ్ జైన్ అధికారులను ఆదేశించారు. అందిన అర్జీలన్నింటినీ శతశాతం పరిష్కరించాలని, తద్వారా అర్జీదారులు సంతృప్తి చెందాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గృహనిర్మాణ సంస్థ తదితర శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఏ శాఖలోనూ అర్జీలు పెండింగ్‌లో ఉండరాదని స్పష్టం చేశారు. ఎక్కువ అర్జీలు పెండింగ్ ఉన్న శాఖలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పరిష్కారమయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి అర్జీ కాలపరిమితి లోగా పరిష్కారం కావాలని, కాలపరిమితి దాటిన వాటికి సరైన కారణాలు ఉండాలన్నారు. జగనన్నకు చెబుదాంలో వచ్చిన వినతులు ఎట్టి పరిస్థితుల్లోనూ రీ ఓపెన్ కారాదన్నారు. సరైన సమాధానం లేదా పరిష్కారంతోనే ఇటువంటివి పునరావృతం కావన్న విషయాన్ని అధికారులు గ్రహించాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకృష్ణ, ఆర్‌డిఒ బి.శాంతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, గృహనిర్మాణ సంస్థ, ఐసిడిఎస్ పీడీలు ఎన్.గణపతి, జి.జయదేవి, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి ఇతర అధికారులు పాల్గొన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి
జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర మౌలిక వసతులను కల్పించాలని సిద్దార్థ్‌జైన్ అన్నారు. ఈనెల 30న వర్చువల్ విధానంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న జలుమూరు మండలంలోని చల్లవానిపేట, లింగాలవలస జగనన్న కాలనీని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పరిశీలించారు. జగనన్న కాలనీకి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వల్ల వస్తున్న దుర్వాసతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వేరేచోట స్థలం కేటాయించి అక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి స్పందించిన కమిషనర్ అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని తహశీల్దార్ బి.సత్యంను ఆదేశించారు. అనంతరం కరవంజలోని సచివాలయం, రైతుభరోసా కేంద్రం, ఎచ్చెర్ల మండలం పొన్నాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపిపి వాన గోపి, జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ తదితరులున్నారు.










