Nov 06,2023 21:33

బాధితులకు ఫోన్లు అందజేస్తున్న ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌

          ప్రజాశక్తి-అనంతపురం క్రైం   అపరిచితులు విక్ర యించే మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసి మోసపోవద్దని ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ సూచించారు. సోమవారం స్థానిక పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో రూ.40.35 లక్షల విలువజేసే 208 సెల్‌ఫోన్లను బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు శాఖ వినూత్నంగా చాట్‌ బాట్‌ సేవల ద్వారా ప్రజలు పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్‌ఫోన్‌ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరి వద్ద నుంచీ కొనుగోలు చేయవద్దన్నారు. ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు సీరియస్‌గా ఉందని, డబ్బు ఐవసరమై మొబైల్‌ అమ్ముతున్నామని నమ్మబలుకుతూ తిరస్కరించిన మొబైల్‌ ఫోన్లను అమ్మే వీలుందన్నారు. అమ్మేవారు మనకు బాగా తెలిసిన వారైనప్పటికీ ఫోన్‌ బిల్లులు, సంబంధిత మొబైల్‌ ఫోన్‌ వివరాలు కలిగిన బాక్స్‌ ఉంటేనే కొనాలని సూచించారు. బిల్లు లేకుండా సెల్‌ఫోన్‌ అమ్ముతామంటూ నమ్మబలికే వ్యక్తులు, సెల్‌ ఫోన్‌ దుకాణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరించే వారిపై సమీపంలోని పోలీసుస్టేషన్‌కు, ఎస్పీ మొబైల్‌ నెంబర్‌ 94407 96800కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.