ప్రజాశక్తి - యడ్లపాడు : రుణాల కోసం తనఖా పెట్టడానికని ఖాతాదార్లు తెచ్చిన బంగారంతో అప్రైజర్ ఉడాయించాడు. మండల కేంద్రమైన యడ్లపాడులోని యూనియన్ బ్యాంకులో బుధవారం జరిగిన ఈ ఘరానీ మోసం బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో గురువారం వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. యడ్లపాడుకు చెందిన నిడమానూరు హరీష్ స్థానిక యూనియన్ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం బ్యాంకులో తనఖా పెట్టిన ఖాతాదారుల బంగారం సుమారు 304 గ్రాములు బ్యాంకులో జమ చేయాల్సి ఉన్నా చేయలేదు. పైగా మధ్యాహ్నం నుండి హరీష్ బ్యాంకుకు రాకపోవడం, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండటంతో అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది సిసి కెమెరాలను పరిశీలించారు. భోజన విరామసమయానికి ముందు తనఖాకు వచ్చిన బంగారాన్ని హరీష్ తన జేబులో పెట్టుకోవడం కనిపించింది. హరీష్ ప్రవర్తనపై అనుమానంతో ఉన్నతా ధికారులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి బ్యాంకులో ఇప్పటి వరకు 1886 ఖాతాల్లో తనఖాకు పెట్టిన బంగారాన్ని పరిశీలించడానికి ఆడిట్ అధికారులను పిలిపించారు. అడిట్ అధికారులు బుధ, గురువారాల్లో సుమారు 500 ఖాతాలను పరిశీలించగా 30 ఖాతాల్లో హరీష్ వేరువేరు పేర్లతో బినామీగా నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.40 లక్షలు తీసుకునట్లు తేలింది. బుధవారం తీసుకెళ్లిన బంగారం విలువ మరో రూ.25 లక్షలు ఉంటుందని, దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చామని, పూర్తి స్థాయిలో ఆడిట్ నిర్వహించి ఎంత మేరకు మోసం చేసింది నిర్థారించి పోలీసులకు పూర్తి సమాచారం ఇస్తామని మేనేజర్ తెలిపారు. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం బ్యాంకులోనే ఉందని, ఎవరూ ఆందోళనకు గురికావొద్దని చెప్పారు. మిగతా ఖాతాల ఆడిట్ కొనసాగుతుందని అన్నారు. అయితే ఇంకా ఆడిట్ జరగాల్సిన ఖాతాల్లో ఏమైనా నకిలీ బంగారం ఉందని తేలితే మోసం చేసిన మొత్తం విలువ మరింత పెరుగుతుంది.










