Sep 24,2023 23:15

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : అపరాల సాగు రైతుల పరిస్థితి అమ్మబొతే అడవి... కొనబోతే కొరివి... అన్న చందంగా మారింది. దీంతో ఈ ఏడాది అపరాల సాగుకు కూడా గురటూరు, పల్నాడు జిల్లాల రైతులు ఆసక్తి చూపడం లేదు. మార్కెట్‌లో ప్రస్తుతం పప్పుదినుసుల ధరలు భారీగా పెరిగాయి. అయినా రైతులు సాగు చేసి దిగుబడులు చేతికి వచ్చే సరికి ఈ స్థాయిలో ధరలు లభిస్తాయనే నమ్మకం లేదు. వర్షాభావం వల్ల ఖరీఫ్‌లో మొదట మూడు నెలల పాటు ఏపంటలు సాగు చేయలేకపోయారు. అంతేగాకుండా ప్రత్యామ్నాయంగా అపరాల సాగుపై దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నా రైతులు ఆసక్తి చూపడం లేదు.
పల్నాడు జిల్లాలో ఏటా 50 వేల ఎకరాల్లో కంది సాగవుతుంది. గతేడాది కందులు క్వింటాళ్‌ గరిష్టంగా రూ.6-7 వేలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం కందిపప్పు మార్కెట్‌లో రూ.180 నుంచి రూ.190 వరకు పలుకుతోంది. కందులు క్వింటాళ్‌ రూ.12 వేల నుంచి రూ.13 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కందుల సాగు పెరుగుతుందని అంచనా వేశారు. కానీ పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 8700 ఎకరాల్లోనే కంది సాగు చేశారు.
గుంటూరు జిల్లాలో 250 ఎకరాల్లోనే సాగు చేస్తారని అంచనా ఉండగా ఇప్పటి వరకు 200 ఎకరాల్లో చేశారు. మినుములు గుంటూరు జిల్లాలో 6 వేల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా 1500 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 3 వేల ఎకరాలకు గాను 625 ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం మినప గుళ్లు కిలో రూ.130 నుంచి రూ.140 వరకు పలుకుతున్నాయి. కానీ గత సీజన్‌లో రైతుల నుంచి క్వింటాలు రూ.5 నుంచి రూ.6 వేలకు మించి కొనుగోలు చేయలేదు.
పెసర పల్నాడు జిల్లాలో వెయ్యి ఎకరాలకు గాను 160 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 300 ఎకరాలకు గాను 42 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో పెసర పప్పు కిలో రూ.120 ఉంటోంది. గత సీజన్‌లో పెసలు క్వింటాలు రూ.5 నుంచి 6వేల వరకు కొనుగోలు చేశారు. మార్కెట్‌లో అపరాల ధరలు ఆశాజనకంగా ఉన్నా సాగు పెరగడంలేదు. ప్రధానంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు దెబ్బతీస్తున్నాయని అపరాల రైతులు వాపోతున్నారు.
కౌలు రైతులకు పెట్టుబడి వ్యయం అధికంగా ఉంటోంది. అపరాలు సాగు చేసిన వెంటనే మూడు నాలుగు రోజులు భారీ వర్షం కురిస్తే పైరు కుళ్లిపోయి ఎందుకు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. నెల రోజులపాటు వర్షంలేకున్నా ఎదుగుదల ఉండదు, దిగుబడి తగ్గిపోతుంది. పైగా తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటోంది. అంతేగాక పంట చేతికి వచ్చే సరికి ధరలు పడిపోతాయి. అందువల్ల అపరాల సాగుకు విముఖంగా ఉన్నట్టు పలువురు రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.20-30 వేల వరకు పెట్టుబడి పెట్టినా పట్టుమని 10 బస్తాలు కూడా రాకపోతే నష్టం మూటగట్టుకోవాల్సి వస్తుంది.
రెండేళ్లుగా శనగల ధరలు క్వింటాలు రూ.4,500 దాటడం లేదు. శనగల ధరలేక తక్కువకు అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా రైతులు ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు. జొన్న, మొక్కజొన్న సాగు విషయంలో రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఖరీఫ్‌లో కంటే రబీలోనే జొన్న, మొక్కజొన్న సాగు మేలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.