బిల్లుల చెల్లింపులో సర్కారు జాప్యం
పెరిగిన ధరలతో సతమతం
గ్యాస్ భారమూ వారిపైనే...
ప్రజాశక్తి - అమలాపురం : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నామని పాలకులు ఊకదంపుడు ప్రసంగాలు చేయడం తప్ప వాటి నిర్వహణకు కృషి చేస్తున్న అంగన్‌వాడీల సమస్యలను మాత్రం పట్టించుకోవట్లేదు. పెరిగిన నిత్యావసరాల ధరలకు తోడు బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని అంగన్‌వాడీలు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ఏడు ప్రాజెక్టుల పరిధిలో 1,726 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 8,043 మంది బాలింతలు, 8,834 మంది గర్భిణులు ఉన్నారు. ఆరు నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలు 16,801 మంది, మూడు నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 39,170 మంది ఉన్నారు.
మోయలేని గ్యాస్ బండ భారం
అంగన్‌వాడీలపై గ్యాస్ బండల భారం పడుతోంది. ప్రస్తుతం గ్యాస్ బండ ధర రూ.950 నుంచి రూ.1000 వరకూ ఉంది. పిల్లలకు గ్యాస్‌పై వంట చేసి పెట్టేందుకు అంగన్‌వాడీలకు ఒక్కో చిన్నారికి 50 పైసల వంతున చెల్లిస్తుంది. పది మంది చిన్నారులున్న కేంద్రంలో నెలకు రూ.150 మాత్రమే వస్తుంది. నెలకు ఒక గ్యాస్ బండ వరకూ అవుతుందని అంగన్‌వాడీలు చెబుతున్నారు. 15 శాతం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగిలిని 85 శాతం భారం తమపై పడుతుందని వాపోతున్నారు. ప్రతినెలా గ్యాస్ రూపేణా రూ.800 నుంచి రూ.850 వరకూ గ్యాస్ భారం తమపై పడుతుందని వాపోతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే గ్యాస్‌ను ఉచితంగా సరఫరా చేయాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. 1726 కేంద్రాల్లో నెలకు ఒక్క గ్యాస్ బండ చొప్పున లెక్కేస్తే అంగన్‌వాడీలపై రూ.10లక్షల నుంచి రూ.14 లక్షల వరకూ పడుతోంది.
అద్దెలూ చెల్లించట్లేదు
జిల్లా వ్యాప్తంగా 520 వరకూ అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి అద్దెలను సైతం ప్రభుత్వం సకాలంలో చెల్లించట్లేదు. ప్రస్తుతం మూడు నెలల సంబంధించి అద్దె బిల్లులు చెల్లించాల్సి ఉది. చెల్లించే అద్దె సైతం తక్కువగా ఉండటంతో మిగిలిన భారం అంగన్‌వాడీలే భరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భవన యజమానుల ఉదారతతో తక్కువ అద్దెకే ఇస్తున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం అదనపు భారాన్ని అంగన్‌వాడీలే భరించాల్సిన పరిస్థితి. అర్బన్ ప్రాంతంలో రూ.4వేల నుంచి రూ.5వేల వరకూ అద్దె ఉండగా, గ్రమాల్లో రూ.3వేల వరకూ అద్దెను అంగన్‌వాడీలు చెల్లిస్తున్నారు.
పెరిగిన కూరగాయల ధరలు
అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఆహారం కేంద్రంలోనే వండి పెట్టాల్సి ఉంది. మెనూ ప్రకారం వారంలో నాలుగురోజులు ఆకుకూరలు, గాయగూరలతో వారికి ఆహారం పెట్టాల్సి ఉంది. దీని కోసం కూరగాయలు, ఆకుకూరలను అంగన్‌వాడీలే స్వయంగా కొనుగోలు చేసి తెస్తున్నారు. వీటి బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయినప్పటికీ అంగన్‌వాడీలు కొనుగోలు చేసి చిన్నారులకు పోషకారం అందేలా చూసుకుంటున్నారు. ధరల పెరిగినప్పటికీ తమకేమీ సంబంధం లేనట్టు ప్రభుత్వం గతంలో ధరలనే అందిస్తుంది. అది కూడా సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆ భారం కూడా అంగన్‌వాడీలపైనే పడుతుంది. ప్రస్తుతం ఫిబ్రవరి నుంచి ఈ బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. ఒక్కొ ప్రాజెక్టు పరిధిలో రూ.2 లక్షల వరకూ కూరగాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏడు ప్రాజెక్టుల పరిధిలో సుమారు రూ.80 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంది.










