Jun 18,2023 21:45

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
             మండలంలోని లక్కవరంలో కలకలం సృష్టించిన వ్యక్తి అదృశ్యం కేసు సుఖాంతమైంది. లక్కవరంలో అదృశ్యమైన వ్యక్తి కేరళలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి లక్కవరం రప్పించారు. ఆదివారం లక్కవరం ఎస్‌ఐ దుర్గా మహేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరానికి చెందిన దుర్గారెడ్డి అప్పుల బాధనుంచి తప్పించుకోవడం కోసం అదృశ్య నాటకం ఆడాడని తెలిపారు. ఇటీవల అద్దెకు కారు తీసుకెళ్లిన దుర్గారెడ్డి తడికలపూడి సమీపంలో మరో కారును ఢకొీట్టాడు. ఈ ప్రమాదంలో కారుకు మరమ్మతులు చేయడానికి సుమారు రూ.1.50 లక్షలు వరకు చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కారు మరమ్మతుకు చెల్లించే డబ్బులతో పాటు మరికొన్ని అప్పులు తీర్చలేక తనకు తాను అదృశ్యమైనట్లు సినీ ఫక్కీలో నాటకానికి తెర లేపాడు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం బ్యాంకు నుంచి రూ.4.80 లక్షలు డ్రా చేసుకొని వస్తుండగా దుర్గారెడ్డి మిస్‌ అయినట్లు ప్రచారం అవ్వడానికి పథకం వేశారు. ఈ క్రమంలో తాను అప్పుల బాధ తాళలేక ఇబ్బంది పడుతున్నట్లు రాజమండ్రిలో తన స్నేహితులతో ఫోన్‌ సంభాషణలు జరిగినట్లు ఆధారాలు కల్పించారు. దుర్గారెడ్డి రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కోణంలో దుర్గారెడ్డి బ్యాంకు వద్ద డబ్బులు డ్రా చేయడంపై పోలీసులు విచారణ జరిపారు. అయితే దుర్గారెడ్డి ఖాతాలో అంత సొమ్ము లేదని వెల్లడైంది. దీంతో మరింత అనుమానం పెరిగింది. దీంతో కేసు విచారణ వేగవంతం చేసిన పోలీసులు సిడిఆర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో దుర్గారెడ్డి రాజమండ్రి రైల్వే స్టేషన్‌కి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి దుర్గారెడ్డి స్నేహితులను కూడా ఆరా తీశారు. ఈ క్రమంలో దుర్గారెడ్డి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తాను కేరళలో ఉన్నట్లు చెప్పడంతో కథ సుఖాంతమైంది. ఈ విషయం పోలీసులకు తెలియజేయగా దుర్గారెడ్డిని లక్కవరం గ్రామానికి రప్పించారు. ఎస్‌ఐ దుర్గా మహేశ్వరరావు సమక్షంలో దుర్గారెడ్డిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పుల బాధ తాళలేక ఇటువంటి నాటకానికి తెర తీసినట్లు దుర్గారెడ్డి ద్వారా వెల్లడి చేశారు. లక్కవరంలో దుర్గారెడ్డి అదృశ్యంపై నెలకొన్న కలకలం ఆదివారం దుర్గారెడ్డి తిరిగి రావడంతో సద్దుమణిగింది. ఆర్థిక ఇబ్బందులతో అదృశ్య నాటకానికి తెర తీసిన దుర్గారెడ్డి మరే ఇతర అఘాయిత్యానికి పాల్పడకుండా కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు లక్కవరం ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావు తెలిపారు.