అప్పుల బాధతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
అప్పుల భారం పెరిగి, వడ్డీలు చెల్లించలేక ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా చిత్తూరు నగరంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు పురుషోత్తం ఆచారి (45) చిత్తూరు నగరంలోని వైఎస్సార్ కాలనీలో నివాసముండేవాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం రూ.3ల వడ్డీకి రూ.70వేలు వేలాయుధం, వసుధల వద్ద అప్పుగా తీసుకున్నాడు. నాలుగేళ్లుగా వడ్డీ చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ రూ.2లక్షలకుపైగా అయ్యింది. అంతేకాకుండా ఇతరుల వద్ద కూడా రూ.2లక్షలకు పైగా అప్పులు ఉన్నట్లు సమచారం. అప్పు పెరగడంతో వేలాయుధం కోర్టులో కేసు వేయడంతో అప్పు వడ్డీల కింద వారు వైఎస్సార్ కాలనీలోని (ప్రస్తుత విలువ) రూ.3లక్షలు విలువ చేసే ఇంటిని జమ చేసుకున్నారు. అప్పుల బాధ ఎక్కువడంతో భార్య పురుషోత్తంను ఇద్దరు పిల్లల్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పులు తీర్చే మార్గం లేకపోవడం, ఉన్న ఇళ్లు పోవడం, భార్య వదిలి వెళ్లడంతో మస్తాపానికి గురైన పురుషోత్తం ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు పురుషోత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వేలాయుధం, వసుధలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా సదరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేయకుండా వన్ టౌన్ పరిధి, టూ టౌన్ పరిధి అంటూ తిప్పు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు చెల్లించాలని వేధింపుల వలనే పురుషోత్తం చనిపోయాడని, పిల్లలు ఇద్దరూ అనాధలయ్యారని వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.










