Oct 13,2023 20:17

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న గజ్జల శ్రీనివాస్‌ రెడ్డి




అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
- నివాళులర్పించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి
ప్రజాశక్తి - కొలిమిగుండ్ల

       కొలిమిగుండ్ల మండలం కొండమీదిపల్లె (దళవాయిపల్లె) గ్రామానికి చెందిన రైతు గజ్జెల శ్రీనివాసుల రెడ్డి (38) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... కొండమీదిపల్లె (దళవాయిపల్లె) గ్రామానికి చెందిన రైఉత గజ్జెల శ్రీనివాసులరెడ్డి తనకున్న 4 ఎకరాలు పొలాన్ని సాగు చేస్తూ మరో ఐదు ఎకరాలు పొలాన్ని గుత్తకు తీసుకొని పప్పు శనగ పంటను సాగు చేసేవాడు. గత నాలుగేళ్లుగా నుండి పంట సరిగా రాకపోవడం, పంటల సాగు కోసం చేసిన అప్పులకు తీరక వడ్డీలు పెరిగిపోయాయి. దాదాపు రూ. 20 లక్షలకు పైగా అప్పు ఉండడం, అప్పులు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో శ్రీనివాసులు రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం రాత్రి ఇంట్లో శనిగలకు పెట్టె మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి శ్రీనివాసులు రెడ్డిని తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స అందించి అనంతపురానికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈయనకు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రమేష్‌ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రైతు మృతదేహానికి నివాళులర్పించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ :
రైతు ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి గ్రామానికి చేరుకుని గజ్జల శ్రీనివాస్‌ రెడ్డి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అధైర్య పడవద్దని, అండగా నిలుస్తామన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. ఆయన వెంట మీర్జాపురం సర్పంచి లాయర్‌ మహేశ్వర్‌ రెడ్డి, పేరం సూర్యనారాయణ రెడ్డి, కొండమీదపల్లె నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.
 

రైతు మృతదేహానికి నివాళులర్పించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ :
రైతు మృతదేహానికి నివాళులర్పించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ :