ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మోనిటైజేషన్, కార్పొరేట్ పన్ను మినహాయింపులు, తక్కువ వడ్డీలకే కార్పొరేట్లకు అప్పులు - ఇవన్నీ చాలవన్నట్టు ఆ కార్పొరేట్లు బ్యాంకులకు బకాయిలు పడితే వాటిని మాఫీ చేస్తున్నారు. ఎంతమేరకు మాఫీ చేశారో ఆ మేరకు బ్యాంకులకు లోటు ఏర్పడుతుంది. దానిని కేంద్రం బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేస్తుంది. అప్పుడు బడ్జెట్‌లో అదనపు ఆదాయం అవసరమౌతుంది. ఆ అవసరాన్ని ఈ పెట్రో పన్నుల పెంపు ద్వారా భర్తీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తున్నది.
క్రికెట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఔట్ అవకుండా పరుగుల వరద పారిస్తున్న ఆటగాడిలా మోడీ పెట్రోలు, డీజిల్ ధరలను లీటరుకు వంద రూపాయలు దాటాక కూడా ఆగకుండా పెంచుకుంటూ పోతున్నారు. మనం కేరింతలు కొట్టే వీక్షకుల స్థానాల్లో లేము. బౌలింగు చేసే స్థానంలో ఉన్నాం. స్కోరు పెరుగుతోంది మోడీకి. పెరిగిపోతున్న ధరలను భరించలేక చెమటలు కక్కుతున్నది మనం.
2014లో మోడీ అధికారం లోకి వచ్చాక పెట్రోలు ధరలు ఏకంగా 79 శాతం పెరిగాయి. డీజిల్ ధరలు మరీ అన్యాయంగా 101 శాతం పెరిగిపోయాయి. గతేడాది కాలంలోనే పెట్రోలు 26 శాతం, డీజిల్ 31 శాతం పెరిగిపోయాయి. వంట గ్యాస్ ధర ఒక్క ఏడాదిలో రూ.300 పైగా పెరిగింది.
కరోనా మహమ్మారి అత్యధిక ప్రజల జీవనోపాధిని, ఆదాయాలను దెబ్బతీసిన ఈ సమయంలో ప్రజలను ఆదుకోవలసింది పోయి వారిమీద మోయలేని భారాలను వడ్డించడం కేంద్ర ప్రభుత్వపు క్రూరమైన మైండ్‌సెట్‌ను సూచిస్తోంది. ఒకవైపు 10 కోట్ల టన్నులకు పైగా ఆహారధాన్యాల నిల్వలను ఉంచుకుని ఇంకొకవైపు భారతదేశాన్ని ప్రజల కడుపులను నింపలేని ఆకలిరాజ్యాల లిస్టులో అగ్రస్థానంలో నిలిపిన ఘనత మోడీకే దక్కుతుంది.
పెట్రో ఉత్పత్తుల ధరలను గతంలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించేది. తరువాత నయా ఉదారవాద విధానాల అమలులో భాగంగా ఆయా కంపెనీలకే విడిచిపెట్టింది. మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చు తగ్గులను బట్టి ఎప్పటికప్పుడు ధరలను నిర్ణయిస్తారని అప్పుడు చెప్పింది ప్రభుత్వం. కాని, ముడి చమురు ధర తగ్గిన కాలంలో సైతం ఇక్కడ పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిపోతూ వచ్చాయి. ఏమిటి కారణం ?
కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల మీద విధించే ఎక్సైజ్ పన్నును ఎప్పుడుబడితే అప్పుడు పెంచుకుంటూ పోతున్నది. పెట్రో ఉత్పత్తుల మీద పన్నును ప్రధాన ఆదాయ వనరుగా చేయడమే దీనికి కారణం. మోడీ అధికారం లోకి వచ్చాక ఈ విధంగా ప్రజల్ని కొల్లగొట్టడం మరింత పెరిగింది. 2014-15లో పెట్రో ఉత్పత్తులమీద కేంద్రానికి వచ్చిన పన్ను రూ.99,000 కోట్లు. అది ఇప్పుడు అమాంతం రూ.3,73,000 కోట్లకు పెరిగింది. గత ఏడాదిలోనే రూ.1,40,000 మేరకు పెరిగింది (2019-20లో రూ.2,23,000 కోట్లు వస్తే 2020-21లో రూ.3,73,000 కోట్లు వచ్చాయి). ఏడేళ్ళ కాలంలో 277 శాతం పెంచారు !
కరోనా కాలంలో సంక్షేమ కార్యక్రమాలకు గాని, ప్రజారోగ్య పరిరక్షణకు గాని, ఉద్యోగాల నియామకాలకు గాని, ఉపాధిహామీ పథకానికి గాని ఖర్చు చేసివుంటే ఈ సొమ్ము ఏదో రూపంలో ప్రజలకు ఉపయోగపడి వుండేది. కాని ఆ విధంగా చేయడంలేదు. కార్పొరేట్లకే సమర్పించు కుంటున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మోనిటైజేషన్, కార్పొరేట్ పన్ను మినహాయింపులు, తక్కువ వడ్డీలకే కార్పొరేట్లకు అప్పులు - ఇవన్నీ చాలవన్నట్టు ఆ కార్పొరేట్లు బ్యాంకులకు బకాయిలు పడితే వాటిని మాఫీ చేస్తున్నారు. ఎంతమేరకు మాఫీ చేశారో ఆ మేరకు బ్యాంకులకు లోటు ఏర్పడుతుంది. దానిని కేంద్రం బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేస్తుంది. అప్పుడు బడ్జెట్‌లో అదనపు ఆదాయం అవసరమౌతుంది. ఆ అవసరాన్ని ఈ పెట్రో పన్నుల పెంపు ద్వారా భర్తీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే కాకుల్ని కొట్టి గద్దలకు వేస్తున్నది.
పెట్రో ధరలు తగ్గాలంటే ఆ పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టి పరిధి లోకి తీసుకురావడమే పరిష్కారం అన్న వాదనను కేంద్రం ముందుకు తెస్తున్నది. ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల మీద మొత్తం కేంద్రానికి వచ్చే అన్ని రకాల పన్నుల ఆదాయం కలిపి చూస్తే రూ.4,20,000 కోట్లు. అందులో ఒక్క ఎక్సైజ్ పన్ను మాత్రమే రూ.3,73,000 కోట్లు. ఇక రాష్ట్రాలన్నీ కలిపి పెట్రో ఉత్పత్తుల మీద వసూలు చేస్తున్న పన్నులు రూ.2,17,000 కోట్లు. అంటే కేంద్రం వసూలు చేసేదానిలో దాదాపు సగం. ఇప్పుడు పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలకు వచ్చే ఆదాయం మొత్తం కేంద్రం అదుపులోకి పోతుంది. కేంద్రం తనకు వచ్చిన పన్నుల్లో రాష్ట్రాలకు వాటా మాత్రం ఇస్తుంది.
15వ ఫైనాన్సు కమిషన్ నివేదిక ప్రకారం దేశంలో వసూలయ్యే పన్నుల్లో కేంద్రం 62.7 శాతం వాటా తీసుకుంటున్నది. రాష్ట్రాలకు 37.3 శాతం వాటా మాత్రమే దక్కుతున్నది. ఐతే ప్రభుత్వ వ్యయంలో మాత్రం రాష్ట్రాలు 62.4 శాతం భరిస్తూంటే కేంద్రం మాత్రం 37.6 శాతం మాత్రమే భరిస్తోంది.
ఆ లెక్కన చూస్తే ఇప్పుడు పెట్రో ఉత్పత్తులను గనుక జిఎస్‌టి పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరిస్తే అవి వసూలు చేసుకుంటున్న రూ.2,17,000 లక్షలలో కేంద్రం 62 శాతం వాటా చేజిక్కించుకుంటుంది. రాష్ట్రాలకు ఒక ప్రధాన ఆదాయ వనరు లేకుండా పోతుంది. తాత్కాలికంగా పెట్రో ధరలు తగ్గవచ్చేమో గాని రాష్ట్రాల ఆదాయాలకు పెద్ద గండి పడుతుంది. అందుకే బిజెపి పాలిత రాష్ట్రాలతో సహా ఏ రాష్ట్రమూ ఇందుకు అంగీకరించడం లేదు.
ఇక్కడ మోడీ ప్రభుత్వం ఇంకో రకమైన నయవంచనకు కూడా పాల్పడుతోంది. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వుంటుంది. అదే వేరే రూపంలో, అంటే సెస్, సర్ఛార్జి వంటి రూపాల్లో వసూలు చేస్తే అందులో రాష్ట్రాలకు వాటా రాదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కేంద్రం సెస్ లను, సర్ఛార్జి ని పెంచుకుంటూ పోతోంది. 2013-14లో సుమారు రూ.1,00,000 కోట్ల వరకూ సెస్ రూపంలో వసూలు చేస్తే అది కాస్తా 2020-21లో రూ.4,00,000 కోట్లు దాటనుంది! అంటే రాష్ట్రాలకు న్యాయంగా చెల్లించాల్సిన వాటాను చెల్లించకుండా ఎగవేస్తోంది. ఇంకోపక్క కేంద్ర ప్రాయోజిత పథకాలకు షరతులను ముడిపెట్టి రాష్ట్రాలు అదనంగా ప్రజలమీద పన్నుల భారం మోపేలా ఒత్తిడి పెంచుతోంది. మన రాష్ట్రంలో ఇటీవల విధించిన చెత్త పన్ను, సవరించిన ఆస్తిపన్ను విధానం, విద్యుత్ సర్ఛార్జి వంటివి ఈ కోవలోనివే.
జిఎస్‌టి ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాలను కేంద్రం ప్రలోభపెట్టింది. దేశంలో 14 శాతం వృద్ధి రేటు ఉంటే ఎంత పన్ను ఆదాయం వస్తుందో అంతమేరకు లెక్కగట్టి రాష్ట్రాలకు పన్ను ఆదాయం గనుక రాకపోతే, ఆ కొరవను కేంద్రమే భర్తీ చేస్తుందని ఆశ చూపించింది. పార్లమెంటులో చట్టం కూడా చేసింది. ఇప్పుడు ఆ మేరకు ఇవ్వకుండా ఎగనామం పెడుతోంది.
కేంద్రం జిఎస్‌టి పన్నులో కొరవను భర్తీ చేసే బాధ్యత 2022 వరకే వహిస్తుంది. ఇప్పుడే ఈ తీరుగా ఉంది. ఇక 2022 తర్వాత రాష్ట్రాల పరిస్థితి ఏం కానున్నదో తలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా చలి పుట్టక మానదు. ఇటువంటి సమయంలో కాస్తంత ఆదాయం వచ్చే పెట్రో పన్నులను కూడా కేంద్రం తన పరిధిలోకి తీసుకుంటే ఇక రాష్ట్రాలది అధోగతే.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పన్నుల్లో తగ్గించుకుని పెట్రో ఉత్పత్తుల ధరలు కాస్తంతైనా తగ్గడానికి ప్రయత్నించాయి. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆ ప్రయత్నం చేశాయి. కేంద్రం కూడా తన వంతు పన్నులను, సెస్‌లను తగ్గించుకుని పెట్రో ధరలను తగ్గించవచ్చు కదా. ఆ పని చేయకుండా పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టి పరిధి లోకి తీసుకువస్తే ధరలు తగ్గించవచ్చునని ప్రచారం చేయడమేమిటి? ఇది కేవలం పెట్రో ధరల పాపాన్ని రాష్ట్రాలమీదకు నెట్టివేయడమే కదా ?
జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు మీద పన్ను విధించింది. అప్పుడు గాంధీజీ దండి యాత్ర నిర్వహించి దేశవ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. అంతిమంగా ఆ సత్యాగ్రహం పుట్టించిన వేడి బ్రిటిష్ పాలనకే చరమగీతం పాడింది. మళ్ళీ ఇప్పుడు పెట్రో పన్నులకు వ్యతిరేకంగా అటువంటి దేశవ్యాప్త ప్రజాందోళన అవసరం కనిపిస్తోంది. ఇది వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల చొరవతో జరగవలసిన పోరాటం. మోడీ నిరంకుశ, ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడే చైతన్యాన్ని రగిలించవలసిన పోరాటం.
ఎం.వి.ఎస్. శర్మ











