ప్రజాశక్తి-తాడేపల్లి : తమ ఇళ్లు ఇక్కడే ఉండే విధంగా చూడాలని, పట్టాలిప్పించే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించాలని సిపిఎం నాయకుల ముందు కెఎల్‌రావు కాలనీ బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల రాజధానిలో భాగమైన నిడమర్రులో కెఎల్‌రావు కాలనీ వాసులకు నివాస అర్హతా పత్రాలు అందజేశారు. అయితే తాము ఎక్కడికీ వెళ్లమని పేదలు చెబుతున్నారు. సుమారు కెఎల్‌రావు కాలనీ కొండ ప్రాంతంలో రెండు వేల మంది నివాసం ఉంటున్నారు. వీరందరూ విజయవాడ ముఠా కార్మికులుగా పని చేస్తున్నారు. మహిళలు వివిధ చేతి వృత్తులను ఆసరి చేసుకుని, మరికొంత మంది ఇళ్ల పనివార్లగా జీవనోపాధి పొందుతున్నారు. ఇక్కడ ఉంటేనే తాము సురక్షితంగా ఉంటామని సిపిఎం నాయకుల ముందు చెప్పారు. గత ఎన్నికలకు ముందు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇళ్లు తొలగిస్తారని, తాము గెలిస్తే ఇళ్లను ఇక్కడే ఉంచుతామని ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్‌కె చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఉన్న స్థలానికే పట్టా ఇవ్వాలని జరిగే ఆందోళనకు ఎక్కడికైనా వస్తామని కెఎల్‌రావు కాలనీ బాధితులు చెబుతున్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, నాయకులు కె.కరుణాకరరావు, ఎస్.ముత్యా లరావు, కె.మేరి, సామ్యేలు పాల్గొన్నారు.
అడవిలోకి వెళ్లి బతకలేం
అచ్చాయమ్మ
ఎక్కడో దూరంగా మమ్మల్ని పడేశారు. అటువంటి అడవి ప్రాంతంలో మేము ఉండేలేం. ఇటీవలే మాకున్న ఒక్కగానొక కొడుకు కూడా చనిపోయాడు. ఇక్కడే ఉంటే ఏదో కష్టపడి పని చేసుకుని బతుకుతున్నాం. మమ్మల్ని ఎక్కడికీ తరలించొద్దు. ఉన్న స్థలానికే పట్టా ఇవ్వాలి.










