ప్రజాశక్తి - దాచేపల్లి : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేశారు. యూనియన్ పల్నాడు జిల్లా కార్యదర్శి అమరారపు సాల్మన్ మాట్లాడుతూ కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు సేవలను కొనియాడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని అన్నారు. తాను అధికారంలోకి వస్తే అందర్నీ పర్మినెంట్ చేస్తానని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ఆ హామీలను విస్మరించారని ఆవేదన వెలిబుచ్చారు. కనీస వేతనం రూ.26 వేలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఆప్కాస్ సంస్థను రద్దు చేయాలని, క్లాప్ డ్రైవర్లకు రూ.18500 ఇవ్వాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటికోసం 7న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు, 17న చలో విజయవాడకు కార్మికులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో కె.యేబు, రాయన్న, సంజీవరావు, పుల్లమ్మ, దేవి, ఎ.నాగేశ్వరరావు, ఎం.నాగేశ్వరరావు, జ్ఞాన ఏసు పాల్గొన్నారు.










