Nov 14,2023 22:34

బూర్జలో లారీలోకి ధాన్యం బస్తాలను ఎక్కిస్తున్న కూలీలు

* కోతల ప్రారంభంలోనే వ్యాపారుల కొనుగోళ్లు
* పొలాల వద్దకు వచ్చి కొంటున్న వర్తకులు
* పచ్చి ధాన్యాన్నీ కొనేస్తున్న వైనం
* 80 కేజీల బస్తాకు రూ.1250 చెల్లింపు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, బూర్జ: జిల్లాలో కోతల దశ ప్రారంభంలోనే దళారులు కొనుగోలు మొదలు పెట్టేశారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు తెరిస్తే తమకు తక్కువ ధరకు ధాన్యం దొరకదని భావించిన వ్యాపారులు పచ్చి ధాన్యాన్ని సైతం కొనుగోలుకు వెనుకాడడం లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వ్యాపారులు గ్రామాల్లోకి వచ్చి దళారుల సాయంతో కొనుగోలు చేస్తున్నారు. పొలాల వద్దకే లారీలను పంపి తరలిస్తున్నారు. రైతులతో బేరాలు సాగించి తమకు నచ్చిన ధరను చెల్లిస్తున్నారు. ధాన్యం రకం ఆధారంగా రేటు ఇస్తున్నారు.

       జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 3,51,843 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ ఏడాది 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. తిండి గింజలు, స్థానిక అవసరాలకు పోనూ మార్కెట్‌లోకి 7.87 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. అందులో 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అధికారులు అందుకనుగుణంగా జిల్లావ్యాప్తంగా 390 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క కేంద్రాన్నీ ఏర్పాటు చేయలేదు. జిల్లాలో జలుమూరు, సారవకోట, బూర్జ తదితర మండలాల్లో పంట కోతలు ముందుగా జరుగుతున్నా, ఇప్పటివరకు కేంద్రాలను తెరవలేదు. ఇదే అదనుగా వ్యాపారులు, దళారులు రంగప్రవేశం చేసి కారుచౌకగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
80 కేజీల బస్తాకు రూ.1250 చెల్లింపు
సాధారణ రకం ధాన్యానికి ప్రభుత్వం 80 కేజీల బస్తాకు రూ.1746.40 మద్దతు ధర చెల్లించాలని నిర్ణయించగా, వ్యాపారులు బస్తాకు రూ.1250 నుంచి రూ.1350 మధ్య మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు తూకంలోనూ బేరసారాలు సాగిస్తున్నారు. పచ్చి ధాన్యం పేరుతో అదనంగా మూడు నుంచి ఐదు కేజీలు తీసుకుంటున్నారు.
కారణాలు ఇవే...
వ్యాపారులు అడిగిన ధరకే ధాన్యం ఇచ్చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కరువు పరిస్థితులు తలెత్తడంతో ఇంజిన్ల సాయంతోనే పంటను కాపాడుకుంటూ వచ్చారు. వర్షాభావ పరిస్థితులతో సుడిదోమ వ్యాపించింది. దీంతో దిగుబడి, నాణ్యత కొంతమేర తగ్గినట్లు రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం ఈ ధాన్యాన్ని కొంటుందో, లేదోనన్న సందేహంతో తక్కువ ధరకే తెగనమ్ముకుంటున్నారు. అదీగాక గతేడాది అనుభవంతో వారు వ్యాపారులకు ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నారు. మ్యాపింగ్‌ పేరుతో రైతులను 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రాలకు పంపారు. వర్షాభావ పరిస్థితులతో ఈ ఖరీఫ్‌లో ఇంజిన్లతో పంటను తడుపుకునేందుకు అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో, అధికంగా అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే ఆలస్యంగా డబ్బులు వస్తాయని కొందరు వ్యాపారులకు ఇచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబరులో ధాన్యం ఇస్తే ఫిబ్రవరిలో డబ్బులు వచ్చాయి. ఈ పరిస్థితులను చూసి ఎక్కువ మంది రైతులు వ్యాపారులు, దళారులకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు.
కొనుగోలు కేంద్రానికి తిరగలేక ఇచ్చేశాను
ఈ ఏడాది ఎనిమిది ఎకరాల్లో వరి వేశాను. రెండు ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. సుమారు 60 బస్తాలను రూ.1250 చొప్పున అమ్మేశాను. గతేడాది 50 బస్తాలను ఆర్‌బికెకు ధాన్యం ఇవ్వడానికి వెళ్లాను. ఆరబెట్టి తేవాలని, ధాన్యం బాగాలేవని రెండు, మూడుసార్లు తిప్పారు. డిసెంబరు చివరి వారంలో ధాన్యం ఇచ్చాను. ఫిబ్రవరి వరకు డబ్బులు వేయలేదు. వీటితో విసిగిపోయి తొందరగా డబ్బులు వస్తాయని బయట వ్యాపారులకు ఇచ్చేశాను.
- శంభాన ఉదరుకుమార్‌, బూర్జ
ఆ ఇబ్బందులు పడలేకే...

నేను నాలుగు ఎకరాల్లో వరి వేశాను. ఈ ఏడాది క్వింటా ధాన్యం వచ్చాయి. బయట వ్యాపారులకు 80 కేజీల బస్తాలను ఒక్కొక్కటి రూ.1250 చొప్పున ఇచ్చేశాను. కొనుగోలు కేంద్రాల మ్యాపింగ్‌ పేరుతో గతేడాది నరసన్నపేట తీసుకువెళ్లమనడంతో నానా అవస్థలు పడ్డాను. ఈసారి అటువంటి ఇబ్బందులు పడలేకే వ్యాపారులకు ఇవ్వాల్సి వచ్చింది.
- అల్లు ముఖలింగం, బూర్జ